తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే బాలరాజు.... ఆయనే బాలచంద్రుడు
దేవదాసు అతడే..కాళిదాసూ అతడే...
కబీరు అతడే...క్షేత్రయ్యా అతడే..
అర్జునుడతడే..అభిమన్యుడూ అతడే...
ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక చారిత్రక పురుషుడు... భక్తవరేణ్యుడు... జానపద కథానాయకుడు... అంతకు మించి అమర ప్రేమికుడు. బహుదూరపు బాటసారి, నట సామ్రాట్, 'నట సార్వభౌమ', 'నట రాజశేఖర', 'కళాప్రవీణ', 'అభినయ నవరస సుధాకర', 'కళా శిరోమణి', 'అభినయ కళాప్రపూర్ణ', 'భారతమాత ముద్దుబిడ్డ' అనే బిరుదులను సొంతం చేసుకున్నాడు.. అతడే ఏఎన్నార్... అక్కినేని నాగేశ్వరరావు.
కృష్ణా జిల్లాలోని రామాపురంలో సెప్టెంబర్20, 1923 న అక్కినేని వెంకటరత్నం, అక్కినేని పున్నమ్మ అనే దంపతులకు అక్కినేని నాగేశ్వరరావు జన్మించారు. తల్లిదండ్రులు రైతు కుటుంబానికి చెందినవారు కావటంతో వారి ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉండేది. దాంతో నాగేశ్వరరావు ప్రాథమిక పాఠశాల విద్య ను మాత్రమే పూర్తి చేసుకున్నారు. కేవలం 10 సంవత్సరాల వయస్సులో థియేటర్ లో నటించటం ప్రారంభించిన అక్కినేని... అమ్మాయిల పాత్రలు చేయడంలోనూ తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఫిబ్రవరి 18, 1949లో అక్కనేని, అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. తన భార్య పేరు మీదుగానే అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల ఉన్నారు.
నట ప్రస్థానం
1941లో 18ఏళ్ల వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని... 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించి కథానాయకుడిగా మారారు. అలా స్టార్ట్ అయిన అక్కినేని నాగేశ్వరరావు నట జీవితం మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగల్య బలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్య భర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 1970లో తెలుగు సినిమా ఇండస్ట్రీను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలోనూ అక్కినేని కీలక పాత్రను వహించారు. 1976 లో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి తెలుగు సినిమాకు మంచి ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను అందించారు. అలా సినీ ప్రస్థానంలో 78 ఏళ్లు ఏఎన్నార్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.
తనయుడితోనూ స్క్రీన్ షేరింగ్...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా, గ్రీకువీరుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జునతోనూ ఏఎన్నార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఆరు సినిమాల్లో నటించారు. అయితే ఓ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ చేయగా... మరో సినిమాలో బాల నటుడిగా నటించారు అంటే మొత్తంగా 8 సినిమాల్లో ఈ తండ్రి తనయులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా వెలుగు నీడలు, సుడిగుండాలు, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్ని పుత్రుడు, రావుగారిల్లు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసు, మనం లాంటి సినిమాల్లో అక్కినేని, నాగార్జునతో కలిసి నటించారు. కొడుకుతోనే కాదు మనవళ్లు అఖిల్, నాగ చైతన్య, సుమంత్ తోనూ నటించి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు. అలా తన 73ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ భాషలల్లో కలిపి మొత్తం 256 సినిమాలలో నటించి, అప్పటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు.
అవార్డులు..
ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు, మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు. దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్(2011)’ను సైతం పొందారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ(1968)’, ‘పద్మభూషణ్(1988)’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడూ అక్కినేనే. ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ , దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ పురస్కారాల్లో మూడు అందుకున్నారు. భారత దేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు. వీటితో పాటు 7 నంది అవార్డులు, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డు లను అక్కినేని అందుకున్నారు.
ఇవే కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అక్కినేని భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకుగానూ 2010లో సుబ్బరామిరెడ్డి మిలీనియం అవార్డును కూడా ఏఎన్నార్ అందుకున్నారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని (2012) పొందారు.
చివరి వరకూ సినిమాలతోనే...
అక్టోబర్ 19, 2013లో అక్కినేని నాగేశ్వరరావు కాన్సర్ బారిన పడ్డారు. తన చివరి రోజుల్లోనూ సినిమాపై ఉన్న మమకారాన్ని నిరూపించుకున్నారు. ఆ ఇష్టంతోనే తన ఆఖరి సినిమా మనం మూవీని పూర్తి చేశారు. 2014 జనవరి 22 న క్యాన్సర్ వ్యాధి కారణంగా అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఏఎన్నార్ తన 83ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.