ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు తుది జట్టులో పెద్దగా మార్పులు చేయలేదని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచనలకు అనుగుణంగానే టీమ్ ఎంపిక జరిగిందన్నాడు. దానివల్ల హిట్‌మ్యాన్ సొంతంగా విజయ వ్యూహాలను రూపొందించుకున్నాడని చెప్పాడు. ‘ఒక టీమ్‌ను ఎంపిక చేస్తే దాన్నే కొనసాగించడానికి నేను ఎక్కువగా ఇష్టపడతా. పదేపదే మార్చడం వల్ల జట్టులో అస్థిరత చోటు చేసుకుంటుంది.
అదే టైమ్‌లో టీమ్ వాతావరణం కూడా దెబ్బతింటుంది. ప్లేయర్లను సురక్షితంగా ఉంచడంతో పాటు అనుకూలమైన వాతావరణంలో మ్యాచ్ ఆడేలా చేయడం నా బాధ్యత. దీని వల్ల సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ ఉంటాయి. కానీ ఆ బాధ్యతను, ఒత్తిడిని మనం తీసుకుంటే మరింత మెరుగ్గా ఆడే అవకాశం వస్తుంది’ అని తన ఫేర్‌వెల్ సందర్భంగా ద్రవిడ్ పేర్కొన్నాడు.
కొవిడ్ తర్వాత టీమ్‌ను నడిపించడం చాలా కష్టంగా మారిందన్నాడు. కొత్తగా కోచ్ బాధ్యతలు తీసుకున్న తాను అరడజను మంది కెప్టెన్లతో కలిసి పని చేయాల్సి వచ్చిందన్నాడు. ప్లేయర్ల గాయాలు, ఫార్మాట్ అవసరాలను బట్టి ముందుకెళ్లామని వెల్లడించాడు. రోహిత్, కోహ్లీతో కలిసి పని చేయడాన్ని చాలా ఆస్వాదించానని ద్రవిడ్ వెల్లడించాడు.