లంచం తీసుకుంటూ బుక్కయిన హెడ్​కానిస్టేబుల్

  • వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్​ చేసిన బాధితులు 
  • యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం పీఎస్​లో ఘటన  
  • సస్పెండ్​ చేసిన సీపీ సుధీర్ బాబు 

సంస్థాన్ నారాయణపురం, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్​లో డ్యూటీ చేస్తున్న హెడ్​ కానిస్టేబుల్ బాధితుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మండల పరిధిలోని కడపగండి తండాకి చెందిన అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఏర్పడగా వారు స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే, వారి నుంచి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గదిలో హెడ్​ కానిస్టేబుల్ ​సూర్యనారాయణ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు రూ.500 ఇవ్వబోతుండగా రూ.వెయ్యి ఇవ్వు అంటూ డిమాండ్  చేయడం వీడియోలో వినిపించింది.

దీన్నంతా సదరు వ్యక్తులు ఫోన్​లో రికార్డు చేసి  వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఇది వైరల్​ కావడంతో విషయం రాచకొండ సీపీ సుధీర్ బాబుకు చేరింది. ఆయన దీనిపై విచారణ జరిపించారు. నిజమేనని తేలడంతో హెడ్​కానిస్టేబుల్​ సూర్యనారాయణను సస్పెండ్​  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  .