- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కాగ జ్ నగర్, వెలుగు: బైక్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కుమర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కెరమెరి మండలం దేవాపూర్ కి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ (48) రెబ్బెనలో ఉంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా సిర్పూర్ టీ పోలీసు స్టేషన్ పరిధిలోని సిర్పూర్–- మాకిడి అంతరాష్ట్ర రోడ్డుపైన చెక్ పోస్ట్ వద్ద డ్యూటీ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం డ్యూటీ ముగిసిన తర్వాత తన బైక్ పై శంకర్ ఇంటికి వెళ్తున్నాడు. వేంపల్లి స్టేజీ సమీపంలో కాగజ్ నగర్ వైపు నుంచి స్పీడ్ గా వెళ్తున్న మరో బైక్ స్పీడ్ బ్రేకర్ వద్ద కంట్రోల్ కాకపోవడంతో శంకర్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో శంకర్ తలకు, నుదుటి మీద తీవ్రగాయాలు అయ్యాయి.
అపస్మారక స్థితిలోకి చేరుకోగా స్థానికులు కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే శంకర్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో బైక్ పై వెళ్తున్న సిర్పూర్ టీ మండలం షేఖ్ అహ్మద్ గూడకు చెందిన బోర్కుట్ నిఖిల్, పారిగాంకి చెందిన దంద్రే శ్రీకాంత్ కు గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ కమలాకర్ ఘటనా స్థలానికి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ టీ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.