
సూర్యాపేట జిల్లా: గుండెపోటు హెడ్ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. అతని కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేట జిల్లా పరిధిలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రమేష్ రాథోడ్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం తుంగతుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిహిస్తున్న సమయంలోనే గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ రమేష్ రాథోడ్ చనిపోయాడు.
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన దిగావత్ రమేష్ నాయక్ (50) గత మూడు సంవత్సరాలుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈరోజు(ఏప్రిల్ 13, 2025) విధి నిర్వహణలో ఉండగా మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. చనిపోయిన రమేష్ రాథోడ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని రమేష్ మృతదేహాన్ని అతని స్వగ్రామమైన తుంగతుర్తికి తరలించారు.
►ALSO READ | హైదరాబాద్ సూరారంలో విషాదం.. లిఫ్ట్ గుంతలో పడిన బంతిని.. కిందకు వంగి తీస్తుండగా..
అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.