ఆసిఫాబాద్/కాగజ్ నగర్/శంషాబాద్, వెలుగు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే దారి తప్పారు. ఓ చోట హెచ్ఎం, మరోచోట ప్రిన్సిపాల్.. స్టూడెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 440 మంది బాలికలు చదువుకుంటున్నారు. రూల్స్ ప్రకారం ఇక్కడ రెగ్యులర్ హెచ్ఎంగా మహిళా టీచర్‌ను నియమించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా మేల్ టీచర్ పార్థిరాంకు ఇన్చార్జి హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మొత్తం 12 మంది సీఆర్టీలు (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్టీచర్స్) ఉండగా.. వారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మేల్ టీచర్లు స్కూల్ క్యాంపస్‌లో ఉండడానికి వీల్లేదు. కానీ ఇన్చార్జి హెచ్ఎం పార్థిరాం రాత్రి సమయాల్లో కూడా స్కూల్లోనే ఉంటున్నారు. పాఠశాలలోని సీసీ కెమెరాలు పనిచేయకున్నా రిపేర్లు చేయించడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవం రోజున ఇద్దరు హైస్కూల్ విద్యార్థినులను పార్థిరాం తన రూమ్ కు పిలిపించుకుని లైంగికంగా వేధించాడు.
స్టూడెంట్ల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎలాగోలా అక్కడి నుంచితప్పించుకున్న బాధిత స్టూడెంట్లు.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లారి జరిగిందంతా తమ తల్లిదండ్రులకు చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. పేరెంట్స్, గ్రామస్తులు కలిసి ఈ నెల 10న స్కూల్‌కు వచ్చి నిలదీశారు. అయితే అప్పటికే మిగిలిన టీచర్లు హెచ్చరించడంతో పారిపోయిన పార్థిరాం.. ఆ రోజు నుంచి డ్యూటీకి రావడం లేదు. దీంతో గిరిజన సంఘాల నాయకులతో కలిసి గ్రామస్తులు ఆదివారం బెజ్జూరు పొలీస్ స్టేషన్లో పార్థిరాంపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని కౌటల సీఐ సాదిక్ పాషా తెలిపారు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా గర్ల్‌చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శకుంతల, కాగజ్ నగర్ ఏటీడీవో కమర్ హుస్సేన్ ఆదివారం స్కూల్లో విచారణ చేపట్టారు. బాధిత స్టూడెంట్లతో పాటు మిగిలిన విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని శకుంతల తెలిపారు. స్కూల్ టెంపరరీ హెచ్ఎంగా కుంటల మానేపల్లి టీచర్ మారుబాయిని నియమిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూల్లో..
హైదరాబాద్‌లో స్టూడెంట్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్ లోని వెంకటేశ్వర కాలనీలో గుర్రం శంకర్ అనే వ్యక్తి ‘రాకేశ్ విద్యానికేతన్’ పేరుతో స్కూల్ నడిపిస్తున్నాడు. అతడే ఎండీ, ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. స్కూల్లో 9, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలతో శంకర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఇద్దరు స్టూడెంట్లు విషయాన్ని తమ పేరెంట్స్ కు చెప్పారు. ఆగ్రహానికి గురైన పేరెంట్స్ ప్రిన్సిపాల్ శంకర్ పై ఆదివారం మైలార్ దేవ్ పల్లి స్టేషన్లో కంప్లయింట్ చేశారు. ‘‘ప్రిన్సిపాల్ అర్ధరాత్రి సమయాల్లో ఫోన్ చేసి మాట్లాడాలని, ముద్దు ఇవ్వాలని అడిగేవాడు. స్కూల్లో కౌగిలించుకుని వేధించేవాడు” అని బాధిత స్టూడెంట్లు వాపోయారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, శంకర్‌ను అరెస్టు చేశారు. కాగా, ఎఫ్ఐఆర్ కాపీ అందిన వెంటనే స్కూల్ పై యాక్షన్ తీసుకుంటామని రాజేంద్రనగర్ ఎంఈవో రాంరెడ్డి తెలిపారు.