- కమీషన్ల కోసం ఫార్మసిస్టులు, డాక్టర్లతో కలిసి దందా
- పర్యవేక్షించని ఆర్‌ఎంవోలు, సూపరింటెండెంట్లు
- నిరుపయోగమైతున్న కోట్ల విలువైన మెడిసిన్
- 2016 నుంచి 2022 వరకు రూ.390.26 కోట్ల మెడిసిన్ వృథా
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో రోగులకు అందాల్సిన విలువైన మెడిసిన్, సర్జికల్ ఐటమ్స్ వార్డు స్టోర్ రూమ్స్‌లో ఏండ్లకు ఏండ్లు మురిగిపోతున్నాయి. కొందరు సిబ్బంది పేషెంట్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి వాటిని తెప్పించి.. పేషెంట్లకు ఇవ్వకుండా స్టోర్ రూమ్స్‌లో మూలకు పడేస్తున్నారు. తమ దగ్గర మందులు లేవని, ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొని తెచ్చుకోవాలని పేషెంట్లకు చెప్తున్నారు. ప్రైవేట్ మెడికల్ షాపులు ఇచ్చే కమీషన్లకు ఆశపడి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లక్షల విలువైన మందులు వృథా అవుతున్నాయి. ఎక్స్‌పైరీ గడువు తీరి ఎటూ కాకుండా పోతున్నాయి.హాస్పిటల్‌లోని ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఓ మెడిసిన్ స్టోర్ ఉంటుంది. ఆ హాస్పిటల్స్‌లో పనిచేసే హెడ్ నర్సులు ఈ వార్డు స్టోర్లకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. తమ వార్డులోని ఇన్‌పేషెంట్లకు ఇవ్వాల్సిన మెడిసిన్, సర్జికల్ ఐటమ్స్‌ను ప్రభుత్వ మెడికల్ స్టోర్ నుంచి తెప్పించుకొని.. వార్డ్ స్టోర్ రూమ్‌లో భద్రపర్చి పేషెంట్లకు అందజేస్తారు. అయితే, కొంత మంది హెడ్ నర్సులు మెడిసిన్, సర్జికల్స్‌ను తెప్పించి, పేషెంట్లకు ఇవ్వకుండా వార్డ్ స్టోర్ రూమ్స్‌లో పడేస్తున్నారు.
నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా వాటిని ఉపయోగించడం లేదు. దీంతో ఒక్కో స్టోర్‌లో లక్షల విలువైన మెడిసిన్, సర్జికల్స్ వృథాగా పోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కలిపి సుమారు 600పైగా వార్డ్ స్టోర్ రూమ్‌లు ఉన్నాయి. ఈ అన్ని స్టోర్లలో కలిపి రూ.కోట్ల విలువైన వస్తువులు మురిగిపోతున్నాయి.
చాలా మెడిసిన్స్ ఎక్స్‌పైరీ తీరిపోతున్నాయి. వాస్తవానికి, మెడిసిన్ ఎక్స్‌పైరీ డేట్ కంటే 6 నెలల ముందే హాస్పిటల్ నుంచి టీఎస్‌ఎంస్‌ఐడీసీకి వెనక్కి పంపించాలి. ఆ మెడిసిన్ సప్లై చేసిన కాంట్రాక్టర్, దానిని తీసుకుని కొత్త మెడిసిన్ సప్లై చేస్తారు. టెండర్ నిబంధనల్లోనే ఈ క్లాజ్ స్పష్టంగా ఉంటుంది. కానీ, హెడ్ నర్సులు ఈ పని చేయడం లేదు.
సర్కార్ దవాఖాన్లలో ‘ప్రైవేటు’ దందా
ప్రభుత్వ దవాఖాన్లలో పదులకొద్దీ ప్రైవేటు మెడికల్ షాపులకు గత సర్కార్ అనుమతులు ఇచ్చింది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ సహా ప్రతి హాస్పిటల్ లోనూ ప్రైవేటు మెడికల్ షాపులు దర్జాగా తమ బిజినెస్‌ను నడుపుకుంటున్నాయి. ఆయా షాపుల యజమానులు కొందరు డాక్టర్లకు, నర్సులకు, ఫార్మసిస్టులకు కమీషన్లు ఇచ్చి తమ దారికి తెచ్చుకుంటున్నారు.
కమీషన్లకు ఆశపడి హాస్పిటల్స్ సిబ్బంది.. ప్రభుత్వం సప్లై చేసిన మెడిసిన్‌ను పేషెంట్లకు ఇవ్వకుండా ప్రైవేటు షాపుల్లో నుంచి కొనుగోలు చేయిస్తున్నారు. ఈ దందాను అరికట్టాలని గతంలోనే కొంత మంది డాక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. కోర్టు కేసుల సాకుతో కనీసం ఒక్క ప్రైవేటు షాపును కూడా గత సర్కార్ తీసేయించలేకపోయింది. ఇప్పటికీ అన్ని హాస్పిటల్స్‌లో ప్రైవేట్ మెడికల్ షాపుల దందా అట్లనే కొనసాగుతున్నది.
బీఆర్‌ఎస్ హయాంలో వందల కోట్లు వృథా!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 –2022 వరకూ సుమారు రూ.390.26 కోట్ల విలువైన మెడిసిన్ పేషెంట్లకు అందకుండానే ఎక్స్‌పైరీ అయిందని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన రిపోర్ట్‌లో కాగ్ వెల్లడించింది. ఈ పరిస్థితిపై అప్పటి ప్రభుత్వాన్ని కాగ్ వివరణ కూడా కోరింది. ‘‘రూ.346.16 కోట్ల విలువైన మెడిసిన్‌ను పేషెంట్లకు సప్లై చేశామని, అయితే ఆ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయకపోవడంతోనే అవి ఎక్స్‌పైరీ అయినట్టుగా పోర్టల్ చూపించిందని నాటి సర్కార్ తెలిపింది.
మరో రూ.21.22 కోట్ల మెడిసిన్ వృథా అయిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఆ డబ్బులను ఆయా కంపెనీలకు తాము చెల్లించలేదని నాటి సర్కార్ సమాధానం ఇచ్చింది. మరో రూ.1.88 కోట్ల ఎక్స్‌పైరీ మెడిసిన్‌ను కంపెనీలకు పంపించి, తిరిగి మంచి మెడిసిన్‌ను తీసుకున్నట్టు పేర్కొంది” అని రిపోర్ట్‌లో కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. మెడిసిన్ ఎక్స్‌పైరీ అవడంతో భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్ము వృథా అయిందని పేర్కొంది.
ప్రైవేట్ స్టోర్లకు పేషెంట్లను పంపుతూ!
స్టోర్లలో కోట్ల విలువైన మెడిసిన్ మురిగిపోయేలా చేయడం వెనుక కమీషన్ల దందా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌పేషెంట్లకు ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వకుండా, మెడిసిన్ లేవని చెప్తూ వారిని హాస్పిటల్స్ ప్రాంగణంలో లేదా హాస్పిటల్స్ ఎదురుగా ఉన్న ప్రైవేటు మెడికల్ షాపుల్లో మెడిసిన్ కొనుక్కునేలా చేస్తున్నారు. తద్వారా ఆయా షాపుల యజమానుల నుంచి కమీషన్లు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో కొందరు హెడ్ నర్సులతో పాటు ఫార్మాసిస్టులు, ఆరోఎంవోల పాత్ర కూడా ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ దందా వల్ల మెడిసిన్ సప్లై చేయడం లేదన్న చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తున్నది. మెడిసిన్ కొనడానికి ప్రభుత్వం చేసిన డబ్బులన్నీ నిరుపయోగంగా మారిపోతున్నాయి.
ఇటీవల ఉస్మానియా హాస్పిటల్‌లో ఓ హెడ్ నర్స్ రిటైర్ అయ్యారు. ఆమె తర్వాత వచ్చిన కొత్త హెడ్ నర్స్ పాత నర్స్‌కు సంబంధించిన వార్డు స్టోర్ రూమ్‌లోని వస్తువులను పరిశీలించగా.. సుమారు రూ. మూడున్నర లక్షల విలువైన ఎక్స్‌పైర్డ్ మెడిసిన్ బయటపడింది. ఏండ్ల తరబడి వినియోగించకుండా ఉన్న విలువైన సర్జికల్ ఐటమ్స్ కూడా అందులో దొరికాయి.
నిలోఫర్ హాస్పిటల్‌లోని ఓ వార్డు స్టోర్ రూమ్‌లో నిరుడు ఫిబ్రవరిలో ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్‌ను, ఈ ఏడాది జనవరిలో ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్‌ను తాను రెండ్రోజుల కింద గుర్తించినట్లు అదే హాస్పిటల్‌కు చెందిన ఓ డాక్టర్ వెలుగుకు తెలిపారు.