Health Alert : డెంగీ, వైరల్, టైఫాయిడ్ జ్వరం తగ్గటం లేదా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Health Alert : డెంగీ, వైరల్, టైఫాయిడ్ జ్వరం తగ్గటం లేదా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒకప్పుడు ఒంట్లో నలతగా ఉన్నా, ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా... 'ఏం కాదులే. రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందిలే' అనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు సిచ్యుయేషన్ అలా లేదు. జ్వరం, తలనొప్పి, దగ్గు వచ్చినయంటే చాలు కరోనా వచ్చిందేమోనన్న అనుమానం. కరోనా టెస్ట్ చేయించుకున్న తర్వాత గానీ మనసు నిమ్మలం అయితలేదు. పైగా ఇది వర్షా కాలం. ఈ సీజన్లో వైరల్ ఫీవర్లు ఎక్కువ. డెంగీ, టైఫాయిడ్, మలేరియా, చికున్ గున్యా వంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు.

జ్వరం వచ్చిన మొదటిరోజే అది దేని వల్ల వచ్చిందో చెప్పలేం. రెండు మూడు రోజుల తర్వాత దానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. అందుకే ఫీవర్ రాగానే ఫీవర్ ఎంత ఉంది? జ్వరంతో పాటు ఏమేం లక్షణాలు ఉన్నాయి? అనేది గమనించాలి. రెండు మూడు రోజులు అయినా కూడా జ్వరం తగ్గకుంటే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. బ్లడ్ టెస్టుతో పాటు కొవిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఛాతి ఎక్స్, స్కానింగ్ తీయించుకుంటే మరీ మంచిది.

వానాకాలంలో జ్వరాలు ఎక్కువ రావడానికి దోమకాటు, కలుషితమైన తిండి, నీళ్లు, మలేరియా, డెంగీ, చికుస్గున్యా, వైరల్ ఫీవర్స్ వస్తాయి. కలుషితమైన నీళ్లు తాగినా, తిండి తిన్నా టైఫాయిడ్, లెప్టోస్పైరా వంటి బ్యాక్టీరియల్ డిసీజ్ లు వచ్చే ఛాన్సులు ఎక్కువ.

డెంగీ

ఎడిస్ ఈజిప్ట్ అనే ఆడ దోమ కుట్టడం వల్ల డెంగీ ఫీవర్ వస్తుంది. ఈ దోమ పగటిపూటనే కుడుతుంది. జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటిపై ఎర్రని మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గడం. విరేచనం నల్లగా ఉండడం.. లాంటివి డెంగీ ఇన్ఫెక్షన్లో కనిపిస్తాయి. కొందరిలో జ్వరం తగ్గిన తర్వాత రక్తస్రావం, బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం లాంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ ఫీవర్ ఉన్నవాళ్లకి ఆస్పిరిన్, బ్రూఫెన్ లాంటి మెడిసిన్స్ ఇవ్వొద్దు.

స్టిరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ప్లేట్ లెట్స్ కౌంట్ టెస్ట్ చేయించుకొని అవసరమైతే ఎక్కించుకోవాలి.

మలేరియా

ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ఈ దోమ కుట్టిన రెండు వారాల్లో జ్వరం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైఫాయిడ్

టైఫాయిడ్ కి కారణం సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఒళ్లు కాలిపోతుంది. తలనొప్పి, డయేరియా, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషితమైన తిండి, నీళ్లు.. ఈ రెండూ టైఫాయిడ్ వ్యాప్తికి కారణ మవుతాయి. యాంటీ బయాటిక్స్, ఫ్లూయిడ్స్ ట్రీట్మెంట్తో టైఫాయిడ్ తగ్గిపోతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • ఇంటి చుట్టుపక్కల వర్షం నీరు నిల్వకుండా చూసుకోవాలి. అలాగే ఓపెన్ డ్రైనేజీ లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.
  • దోమలు కుట్టకుండా ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు వేసుకోవాలి. ఓడొమాస్ వంటి క్రీమ్స్ రాసుకోవాలి.
  • ఇంట్లో దోమ తెరలు వాడాలి. ఇంటి పరిసరాల్లో తరచూ ఫాగింగ్ చేయించాలి. ఫుడ్ వేడిగా ఉన్నప్పుడే తినాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇమ్యూనిటీ లు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తినాలి.
  • సెల్ఫ్ మెడిసిన్ సేఫ్ కాదు

కొవిడ్ అవునా! కాదా!

ఫీవర్ రాగానే అది డెంగీనా, మలేరియానా అనేది చెప్పలేం. అన్నింటిలో లక్షణా సుమారు ఒకేలా ఉంటాయి. రెండు మూడు రోజులయ్యాక కూడా లక్షణాలు అలానే ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఒంటి మీద ర్యాషెస్ ఉన్నాయా? వాంతులు అవుతున్నాయా? కడుపునొప్పి ఉందా?, విరేచనం సరిగా అవుతుందా? అనేది పరీక్షిస్తారు. ఆరీ-పీసీఆర్ టెస్ట్ చేసారు.