Good Health : తమలపాకు తింటే.. అదేనండీ కిళ్లీ తింటే.. ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తారంట.. !

వెలుగు, లైఫ్: మీరు కిల్లీ ఎప్పుడైనా తిన్నారా? అదేనండీ తాంబూలం.. తమలపాకుతో చేస్తారు కదా..! తింటే మంచిదని పెద్దలు చెపుతుంటారు. మనం యవ్వనంగా కనిపించేందుకు చాలా సహకరిస్తుందట. అది ఎలాగో చదవండి.

సాధారణంగా శుభకార్యాల్లో తాంబూలంగా ఇచ్చే తమలపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముకలు గట్టి పడేందుకు కావాల్సిన క్యాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో ఎక్కువగా ఉంటాయి. తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకులను కాసేపు నుదుటిపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందట.. త్వరగా వృద్ధాప్యపు చాయలు కనిపించకుండా ఉండాలంటే తమలపాకులు తినాలి. 

Also Read:-ఈ రెండు జ్యూసులు తాగితే.. డెంగ్యూ జ్వరం రాదంట.. !

తమలపాకుల్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా ఫంగస్ రాదు. అంతేకాదు. బోధకాలు వ్యాధితో బాధపడేవారు రోజూ కొన్ని తమలపాకుల్ని కాస్త ఉప్పు వేసి దంచి ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుని తాగితే మంచిది. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కూడా రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. అది తిన్న వెంటనే చల్లనీళ్లు తాగాలి. బాగా తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే కాస్త తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చట. 

మరో ముఖ్య విషయం చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్నితలకు పట్టించండి. తర్వాత స్నానం చేయండి. చుండ్రు పోతుంది. మోకాలి నొప్పులు దూరం కావాలంటే కూడా తమలపాకుల రసం తాగితే మంచిదంటారు. అందుకే మరి తమలపాకును.. రాజులు మెచ్చిన రతనాల ఆకు అన్నారు.