‘‘సూపర్ ఫుడ్, వండర్ గ్రెయిన్’’.. మిల్లెట్స్ ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పే మాటలివి. ‘‘హై కార్బ్, మూడు పూటలా తింటే వెరీ డేంజర్’’.. ఇవి అన్నం ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పే మాటలు. అయినా.. జనాలు అన్నమే ఎందుకు తింటున్నరు? అంటే దీనికి చాలా కారణాలు ఉన్నయ్. హరిత విప్లవం నుంచి ప్రభుత్వ విధానాల వరకు అన్ని అన్నానికే ఓటేశాయ్. ఇప్పుడు ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ పాత పద్ధతులే మేలు అంటున్నరు ఎక్స్పర్ట్స్. ఒకప్పుడు పేదల ఆకలిని తీర్చిన ఈ చిరు ధాన్యాలు ఇప్పుడు వాళ్లకే దూరమైనయ్. అందుకే వాటిని మళ్లీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఐక్యరాజ్య సమితితోపాటు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నయ్. అందులో భాగంగానే అందరూ మధ్యాహ్న భోజనంగా మిల్లెట్స్ తీసుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్తున్నరు.
పల్లెల్లో పెద్దవాళ్లు ‘‘పండుగలు, పబ్బాలకే తెల్లన్నం తినేటోళ్లం. మిగతా రోజుల్లో తైద అంబలి, జొన్న రొట్టెలు, సామల అన్నమే దిక్కు” అని చెప్తుంటారు. తర్వాత ఆ పరిస్థితి నుంచి.. రోజూ అన్నం తిని ఎప్పుడో ఒకసారి మిల్లెట్స్ తినే పరిస్థితికి వచ్చారు. కానీ.. ఇప్పుడు మళ్లీ పాత అలవాట్లే మంచివని, మిల్లెట్స్ తినాలని న్యూట్రిషనిస్ట్‌లు చెప్తున్నారు. అంతెందుకు మన ప్రధానితోపాటు ఐక్యరాజ్య సమితి కూడా ‘చిరు ధాన్యాలతోనే ఆరోగ్య సిరి’ అంటోంది. అసలు మిల్లెట్స్‌లో ఏముంది? నిజంగానే వాటిని తినాల్సిన అవసరం ఉందా? అన్నీ తెలిసినా అన్నమే ఎందుకు తింటున్నారు?
ఫ్యామిలీ పెద్దదే
సాధారణంగా చిన్నసైజు గింజ ఉండే గడ్డి జాతి పంటలను మిల్లెట్స్ అని పిలుస్తుంటారు. మెట్ట, కొండ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. ఖరీఫ్‌లో కూడా బాగా పండుతాయి. పేరుకు చిరు ధాన్యాలు కానీ.. వాటి కుటుంబం చాలా పెద్దది. ఎన్నో రకాల ధాన్యాలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కాకపోతే ఎక్కడ పండే మిల్లెట్స్ అక్కడ ఫేమస్. 130 దేశాల్లో కలిపి దాదాపు 6 వేల రకాల మిల్లెట్స్‌ని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికిపైగా మిల్లెట్స్‌ని సంప్రదాయ ఆహారంగా భావిస్తారు. మన దగ్గర జొన్నలు, రాగులు, వరిగెలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు, అండు కొర్రలు లాంటివి ఎక్కువగా పండిస్తున్నారు. చాలా రకాల మిల్లెట్స్ పంటలు 70 రోజుల్లోనే చేతికి అందుతాయి.
ఒకప్పుడు రైతులు తమ భూమిలో ప్రత్యేకంగా కొంత భాగాన్ని మిల్లెట్స్ పండించడం కోసమే కేటాయించేవాళ్లు. ఆ తర్వాత భూమిలో ఎక్కువ భాగం వాణిజ్య పంటలు, వరి, గోధుమలు, కూరగాయల్ని పండించి, మిగిలిన భూమిలో మిల్లెట్స్‌ని పండించడం మొదలుపెట్టారు. అంటే రాళ్లు ఎక్కువగా ఉండే, నీరు సరిపడా లేని భూముల్లో ఈ పంటలు పండించేవాళ్లన్నమాట. కానీ.. కొన్నేండ్లకు ఆ పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చాయి. చాలామంది రైతులు వీటిని పండించడమే మానేశారు. ప్రస్తుతం కొందరు మాత్రమే పండిస్తున్నారు. దాంతో కొన్ని రకాల మిల్లెట్స్ కనుమరుగయ్యాయి. అందుకే మన తాతలు తిన్న చిరుధాన్యాల్లో కొన్ని రకాలు మనలో చాలామందికి తెలియదు. వాటిని ఇప్పుడు చూడాలన్నా కష్టమే. కొన్ని రకాలు ఇప్పటికీ పండిస్తున్నా.. చాలామందికి తినే స్థోమత లేదు. ఒకప్పుడు పల్లెల్లో ఉండేవాళ్లే ఎక్కువగా వీటిని తినేవాళ్లు. అందుకే పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఎవరికి కావాల్సినన్ని వాళ్లు పండించుకునేవాళ్లు. కానీ... మనం ఇప్పుడు తింటున్న గోధుమలు, బియ్యంతో పోలిస్తే.. ఈ చిరుధాన్యాలు హెల్త్‌కు చాలా మంచివని న్యూట్రిషనిస్ట్‌లు చెప్తుండడంతో అందరూ తింటున్నారు.
చాలా బెనిఫిట్స్
‘ఇప్పుడు రైస్ తింటున్నా.. అంతా బాగానే ఉంది కదా? ప్రత్యేకంగా మిల్లెట్స్ ఎందుకు తినాలి? పైగా కొన్ని రకాల మిల్లెట్స్‌తో పోలిస్తే.. గోధుమలు, రైస్ చాలా టేస్టీగా ఉన్నాయి’ అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ.. రైస్‌తో పోలిస్తే మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా గ్లూటెన్ ఉండదు. చాలా పోషకాలు ఉంటాయి. చాలా రకాల మిల్లెట్స్‌లో 10 శాతం ప్రొటీన్, 3.5 శాతం లిపిడ్స్ ఉంటాయి. రాగుల్లో అయితే.. ఏకంగా 12–-16 శాతం ప్రొటీన్ ఉంటుంది. 2–-5 శాతం లిపిడ్స్ ఉంటాయి. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జొన్నల్లో డైటరీ ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్, కాపర్, మాంగనీస్ లాంటివన్నీ ఉంటాయి. వీటివల్ల ఊబకాయం, షుగర్, గుండెపోటు లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. వీటిపై చేసిన రీసెర్చ్‌ల్లో మిల్లెట్స్ హెల్త్ మీద మంచి ప్రభావం చూపిస్తాయని తేలింది. ఇవి తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే ఈ మధ్య సెలబ్రిటీలు, డాక్టర్లు, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మిల్లెట్స్ బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియా ద్వారా జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు.
పిల్లలు తినొచ్చా?
మిల్లెట్స్ పిల్లలకు పెడితే సరిగ్గా జీర్ణం కావు అనుకుంటారు. కానీ.. ఇది పెద్దలతోపాటు పిల్లలకు కూడా మంచి ఫుడ్ అని న్యూట్రిషనిస్ట్‌లు చెప్తున్నారు. కాబట్టి అందరూ వీటిని హాయిగా తినొచ్చు. కాకపోతే వయసును బట్టి క్వాంటిటీ ఉండాలి. చిన్నపిల్లలు తక్కువ, పెద్దలు ఎక్కువ తినాలి. ప్రత్యేకంగా పిల్లలకు మిల్లెట్స్‌తో జావ (మాల్ట్) చేసి ఇవ్వొచ్చు. సంప్రదాయ పద్ధతుల్లో తినలేకపోతే.. కేక్స్, బిస్కెట్లలా కూడా చేసుకోవచ్చు. పెద్దలైతే పొట్టు తీయని మిల్లెట్స్ తింటే మంచిది. అవి లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా కాపాడతాయి.
తెల్ల బియ్యమే..
మన దేశంలో హరిత విప్లవం తర్వాత గోధుమలు, బియ్యం తినడం పెరిగింది. అలా పెరుగుతూ ప్రస్తుతం దేశమంతా తెల్ల బియ్యం, రిఫైన్డ్ గోధుమ పిండిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఈ ఆహారపు అలవాట్ల వల్లే ప్రతి ఆరుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురు పెద్దవాళ్లలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్లే కాదు.. ప్రి–స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకు చాలామంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటున్నారు. పైగా చాలామందిలో మైక్రో న్యూట్రియెంట్స్ లోపం ఉంటోంది. ఆడవాళ్ల విషయానికి వస్తే.. సగం కంటే ఎక్కువమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మిల్లెట్స్ తినడం తగ్గించిన రాష్ట్రాల్లో జింక్ లోపం స్పీడ్‌గా పెరిగింది. మిల్లెట్స్‌లో జింక్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సగటు ఇండియన్ తినే ఫుడ్‌లో ఎక్కువ క్యాలరీలు ఉన్నా.. మైక్రో న్యూట్రియెంట్స్ చాలా తక్కువ. అందువల్ల కడుపు నిండా తిన్నా ఆకలి తీరనట్టే లెక్క.
సాగు తగ్గింది
కొన్ని కారణాల వల్ల అనేక ఏండ్ల పాటు ప్రజలు మిల్లెట్స్ సాగుని పట్టించుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు. దాంతో సాగు విస్తీర్ణం తగ్గింది. మిల్లెట్స్‌కి డిమాండ్ పెరిగింది. కానీ.. ఒకప్పుడు డబ్బున్న వాళ్లు ఎక్కువగా రైస్ తినేవాళ్లు. ఇప్పుడు పేదవాళ్లు ఎక్కువగా రైస్ తింటున్నారు. మిల్లెట్స్ డబ్బున్నోళ్ల తిండిగా మారింది. అందుకే మిల్లెట్స్ అందరికీ అందాలి. వాటిని తినేవాళ్ల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఇండియా 2023ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించాలని ఐక్యారాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ప్రపోజల్ పెట్టింది.
ఈ ప్రపోజల్‌ని 72 దేశాలు సపోర్ట్ చేశాయి. అందుకే జనరల్ అసెంబ్లీ 2023ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా తీర్మానించింది. మిల్లెట్స్ వాడకం పెరిగేటట్టు ప్లాన్ చేస్తోంది. దీనివల్ల అన్ని దేశాల్లో మిల్లెట్స్ సాగు, న్యూట్రిషన్ వ్యాల్యూస్ మీద రీసెర్చ్‌లు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ జనరేషన్స్‌కు మిల్లెట్స్ అవసరం, వాటి ఉపయోగాలు తెలుస్తాయి. రైతులకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఎన్నో రకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నా.. ప్రపంచ ప్రజలకు అవసరమయ్యే క్యాలరీల్లో 50 శాతం కంటే ఎక్కువ కేవలం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న మాత్రమే ఇస్తున్నాయి. ఈ మూడే ప్రపంచ ఆకలిని తీరుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
హరిత విప్లవం
హరిత విప్లవం వచ్చేదాక అంటే.. 1960ల వరకు మన దేశంలో మిల్లెట్స్ తినేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో చిరు ధాన్యాలే ప్రధాన ఆహారంగా ఉండేవి. కానీ.. హరిత విప్లవంలో భాగంగా గోధుమలు, వరి సాగు విపరీతంగా పెరిగింది. దిగుబడులు పెరిగి రైతులకు లాభాలు రావడం మొదలైంది. దాంతో వాటినే పండించడం, తినడం మొదలుపెట్టారు. 1962–2010 మధ్య కాలంలో మిల్లెట్స్ వినియోగం దాదాపు 90 శాతం పడిపోయింది. 1960కి ముందు సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి 33 కిలోల మిల్లెట్స్ తినేవాడు. కానీ.. 2010 నాటికి సగటున నాలుగు కిలోలు మాత్రమే తింటున్నాడు. ఇదే టైంలో గోధుమల వాడకం దాదాపు రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు ఒక వ్యక్తి సంవత్సరానికి 27 కిలోల గోధుమలు తినేవాడు. కానీ.. 2010 నాటికి అది 52 కిలోలకు పెరిగింది. ఎరువులు, అధిక దిగుబడి ఇచ్చే గోధుమలు, వరిలో కొత్త వంగడాలు మార్కెట్లోకి రావడంతో మిల్లెట్స్ సాగు చేసే వ్యవసాయ భూముల్లో గోధుమలు, వరి సాగు చేయడం మొదలుపెట్టారు రైతులు.
పట్టించుకోలేదు
బ్రిటిషర్లు మన దేశానికి వచ్చేవరకు మిల్లెట్స్ చాలామందికి మెయిన్ ఫుడ్‌గా ఉండేది. ఏ ప్రాంతంలో పండే మిల్లెట్స్‌ని ఆ ప్రాంతం వాళ్లు తినేవాళ్లు. కానీ.. బ్రిటిషర్లు మిల్లెట్స్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి కంటిన్యూ అయ్యింది. సైంటిస్ట్‌లు కూడా వాటిని పట్టించుకోలేదనే చెప్పాలి. వరి, గోధుమ లాంటి పంటల దిగుబడి పెంచేందుకే రీసెర్చ్‌లు చేశారు. హరిత విప్లవంలో భాగంగా ప్రభుత్వాలు బియ్యం, గోధుమలు లాంటి వాటికే రాయితీలు ఇచ్చాయి. అందుకే 1970వ దశకం మొదట్లో అనేక రకాల మిల్లెట్స్ అంతరించిపోయే దశకు వచ్చాయి.
రేషన్ విధానం
1970ల తర్వాత మిల్లెట్స్ సాగు విస్తీర్ణం చాలా తగ్గింది. అందుకు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా కారణమైంది. మన దేశంలో రేషన్ దుకాణాల ద్వారా సుమారు 16 కోట్ల కుటుంబాలకు ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన బియ్యం, గోధుమలు, వంట నూనె, చక్కెర లాంటి వాటిని ఇస్తున్నారు. అవన్నీ రైతుల నుంచే ప్రభుత్వం సేకరిస్తుంది. దానివల్ల మార్కెట్లో వాటికి డిమాండ్ పెరిగింది. పైగా ఈ పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రైతులంతా మిల్లెట్స్‌కు బదులు వరి, గోధుమలు పండించడం అలవాటు చేసుకున్నారు.
వేల ఏండ్ల నాటి నుంచే..
మిల్లెట్ చరిత్ర ఈనాటిది కాదు.. కొన్ని వేల ఏండ్ల కిందటి నుంచే మిల్లెట్స్‌ని సాగు చేయడం, తినడం మన కల్చర్‌లో భాగం. ఏడు వేల ఏండ్ల కింద మొదటిసారి ప్రోసో(వరిగెలు) అనే చిరుధాన్యాలను ఉత్తర చైనాలో పండించారు. తర్వాత మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న రైతులు ఆ ప్రాంతంలో దొరికే చిరు ధాన్యాలను సేకరించి విత్తడం మొదలుపెట్టారు. ఇలా మిల్లెట్స్ సాగు ప్రపంచమంతా మొదలైంది. కొన్ని దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మిల్లెట్స్ మెయిన్ ఫుడ్. కానీ.. అమెరికా, యూరప్ల్లోని కొన్ని ప్రాంతాల్లో చాలామంది మిల్లెట్స్‌ని పెట్స్ ఫుడ్‌గా చూస్తారు.
ఇండియాలో దాదాపు అన్ని పురాతన నాగరికతల్లో మిల్లెట్స్ ఆనవాళ్లు ఉన్నాయి. మన దగ్గర మొదట్లో ముఖ్యంగా సాన్వా(బొంత చామలు), బ్రౌన్‌టాప్(అండు కొర్రలు), కోడో(అరికెలు) లాంటి మిల్లెట్స్ ఎక్కువగా పండించేవాళ్లు. తర్వాత దాదాపు అన్ని రకాల మిల్లెట్స్ ఇండియాలో పండాయి. క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నాటికి మన దగ్గర దొరికే రకాలను పండించడంతోపాటు చైనా, ఆఫ్రికాల్లో పండే అనేక రకాల మిల్లెట్స్‌ని దిగుమతి చేసుకోవడం, సాగు చేయడం మొదలుపెట్టారు. మన దగ్గర తవ్వకాల్లో రెండు వేల ఏండ్ల నాటి 20 రకాల మిల్లెట్స్ బయటపడ్డాయి.
మళ్లీ పుంజుకుంటోంది
వరి, గోధుమలే మెయిన్ ఫుడ్‌గా తీసుకుంటున్న టైంలో 2007, 2008లో ఇండియాతో సహా ఆసియాలోని చాలా దేశాల్లో కరువు వచ్చింది. అది తినడానికి వాడే అన్ని సరుకుల ధరలు పెరగడానికి దారి తీసింది. పంటలు సరిగా పండకపోవడం, తెగుళ్లు రావడం వల్ల దిగుబడులు బాగా తగ్గాయి. ధాన్యపు నిల్వలు తక్కువగా ఉండడంతో ఆహార వ్యవస్థ చాలావరకు దెబ్బతిన్నది. దాంతో కొన్ని దేశాలు బియ్యం ఎక్స్‌పోర్ట్స్‌ని ఆపేశాయి. దీనివల్ల ఫుడ్ మార్కెట్ అస్తవ్యస్తంగా మారిపోయింది. ధాన్యం ధరలు నాలుగు నెలల్లోనే దాదాపు 50 శాతం వరకు పెరిగాయి. అప్పుడే అన్ని దేశాలు మిల్లెట్స్ ఇంపార్టెన్స్‌ని గుర్తించాయి.
బియ్యం, గోధుమలతోపాటు మిల్లెట్స్ సాగు కూడా పెరిగితే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందుకే అప్పటి నుంచి చాలా దేశాలు మిల్లెట్స్ సాగు విస్తీర్ణం పెంచే పనిలో పడ్డాయి.
ప్రపంచ జనాభా 2050 నాటికి దాదాపు వెయ్యి కోట్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఇలాంటి టైంలో పంటల్లో మార్పులు చాలా అవసరం. ఎందుకంటే.. ప్రజలకు సరిపడా తిండి పండించడమే కాదు.. పౌష్టికాహారం అందించడం కూడా ప్రభుత్వాల పనే. అధిక దిగుబడినిచ్చే ఆధునిక పంటలతోపాటు చీడపీడలను తట్టుకుని ఎక్కువగా నీళ్లు లేకున్నా పండే చిరు ధాన్యాలను కూడా పండిస్తేనే కరువులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే.. వరి, గోధుమల కంటే మిల్లెట్స్‌కు తెగుళ్ల నుంచి తట్టుకునే శక్తి ఎక్కువ. పైగా కెమికల్స్, ఎరువులు పెద్దగా లేకున్నా పెరుగుతాయి.
తొమ్మిది రకాలే...
మనుషులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి.. అంటే దాదాపు పది వేల ఏండ్ల కంటే ముందు నుంచే పంట మార్పిడి పద్ధతులను పాటిస్తున్నారు. అంటే అనేక రకాలు పంటలు సాగు చేస్తున్నారు. కానీ.. కొన్ని ఏండ్ల నుంచి ఆ నియమాన్ని పక్కనపెట్టేశారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చిరుధాన్యాలతో కలిపి అనేక రకాల పంటలు సాగు చేసేవాళ్లు. కానీ.. యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రపంచం ఎక్కువగా తొమ్మిది రకాలపైనే ఆధారపడింది. వాటిలో బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ముఖ్యమైనవి. వీటితోపాటు ఆలుగడ్డ, బార్లీ, పామాయిల్, సోయా, చక్కెర(దుంప, చెరుకు) మాత్రమే ఎక్కువగా పండిస్తున్నారు.
ఒకేదానిపై ఆధారపడితే..
మనం తక్కువ రకాల పంటలపై మాత్రమే ఆధారపడితే భవిష్యత్తులో ఫుడ్ క్రైసిస్ తప్పదని సైంటిస్ట్‌లు అంటున్నారు. అందుకే బియ్యం, గోధుమలపై మాత్రమే ఆధారపడడం అంత మంచిది కాదు. ప్రపంచానికి పంటల వైవిధ్యం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం. ఎందుకంటే.. వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం పండిస్తున్న పంటలకు భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. ఈ సంవత్సరం ఉత్తర అమెరికా, యూరప్‌లలో కరువు వచ్చింది. దాంతో వ్యవసాయ దిగుబడులు చాలావరకు తగ్గాయి. అంతెందుకు మన దేశంలో కూడా వేడిగాలులు వీయడం వల్ల గోధుమ పంట తగ్గింది. కొంతమంది రైతులు మూడో వంతు దిగుబడి మాత్రమే వచ్చిందని చెప్పారు. అదే వ్యవసాయ వైవిధ్యం పాటిస్తే.. అంటే కొన్ని రకాల మిల్లెట్స్ సాగు చేస్తే.. నష్టం పెద్దగా ఉండేది కాదు.
ఎన్విరాన్మెంట్కు మంచిది
మిల్లెట్స్ సాగు మనకే కాదు.. ఎన్విరాన్మెంట్కు కూడా మేలు చేస్తుందని సైంటిస్ట్‌లు అంటున్నారు. ‘‘ఇప్పుడు తింటున్న ధాన్యాల దిగుబడిని పెంచడం, వాటిని చీడల నుంచి తట్టుకునే విధంగా డెవలప్ చేయడం కంటే.. వాటితోపాటు చిరు ధాన్యాలను పండించి, తినడం మంచిద’’ని చెప్తున్నారు. అలా చేయడం ఎన్విరాన్మెంట్కు కూడా మంచిదని నిరూపించారు. 2019లో ఇండియాలో కొంత విస్తీర్ణంలో వరి సాగుకు బదులు మిల్లెట్స్ (సజ్జలు, జొన్నలు లాంటివి) వేసి, పరిశీలించారు. అప్పుడు సైంటిస్ట్‌లు ఈ పంటలు వరితో పోలిస్తే తక్కువ గ్రీన్‌హౌజ్ గ్యాస్‌ను విడుదల చేస్తాయని, వాతావరణంలో మార్పులు రాకుండా కాపాడేందుకు ఈ పంటలు ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. వరితో పోలిస్తే.. నీళ్లు, శ్రామిక శక్తి కూడా తక్కువ అవసరం అవుతాయని చెప్పారు. ఈ పంటలు పండడానికి సింథటిక్ ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. కాబట్టి కెమికల్ ఫ్రీ. దాదాపు అన్ని రకాల మిల్లెట్స్‌కి పైపొర చాలా గట్టిగా ఉంటుంది. ఇవి చాలా చిన్న సైజ్‌లో ఉంటాయి. అందుకే కరువు, తెగుళ్ళను, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి.
అవసరమా?
మిల్లెట్స్ సాగును పెంచాల్సిన అవసరం ప్రపంచానికి ఎంతగానో ఉంది. ఎందుకంటే.. కొన్నేండ్ల నుంచి ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న నీటి కొరత, తక్కువ సాగు భూమి, ఎక్కువ జనాభా లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా... మిల్లెట్స్ సాగు తప్పనిసరిగా చేయాలని చెప్తున్నారు సైంటిస్ట్‌లు. పైగా మన జనాభాలో 14 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తీర్చే శక్తి మిల్లెట్స్‌కు ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మిల్లెట్స్ తినడం ఇండియన్స్‌కి కొత్తేమీ కాదు. హరిత విప్లవానికి ముందు అందరూ ఇవే తిన్నారు. పైగా వీటితో అనేక రకాల సంప్రదాయ వంటకాలు చేసుకోవచ్చు. అంతెందుకు వీటితో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు.
ఎక్కడైనా పండుతాయి
వరి, గోధుమలతో పోలిస్తే తక్కువ టైంలో పండుతాయి. చాలా రకాల మిల్లెట్స్ 70–100 రోజుల్లో పండుతాయి. కానీ.. వరి, గోధుమలు పండడానికి 120–-150 రోజులు పడుతుంది. అంతేకాదు వరి, గోధుమలతో పోలిస్తే వీటిని పండించడానికి నీళ్ల అవసరం తక్కువే. మిల్లెట్స్ పండడానికి తక్కువలో తక్కువ 350–500 మిల్లీమీటర్లు వర్షపాతం అవసరం. అదే వరి, గోధుమలకు అయితే 600-–1,200 మిల్లీమీటర్ల వర్షం కావాలి. అంటే తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కూడా మిల్లెట్స్ పండుతాయి. కొండ ప్రాంతాల్లో కూడా పండించొచ్చు.
కర్నాటకలోని తుంకూరుకు 70 కి.మీ దూరంలో సిరా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో హోండూరే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోరలె రఘు అనే రైతు ప్రతి ఏడాది వానాకాలంలో మొక్కజొన్న పండిస్తుంటాడు. ఆ ప్రాంతంలో నీటికి చాలా కరువు ఉంటుంది. ఎక్కువమంది వర్షం మీద ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రతిసారి సరిగ్గా వర్షాలు పడకపోవడంతో పంటలు సరిగా పండేవి కాదు. దాంతో కొన్నేండ్ల క్రితం రఘు అండు కొర్రల సాగు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వర్షాలు పెద్దగా పడకపోయినా మంచి దిగుబడి వస్తోంది. 2011లో మొదటిసారి ఎనిమిదిన్నర ఎకరాల్లో అండు కొర్రలు సాగు చేశాడు. అప్పుడు 80 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు. ఆ తర్వాత దిగుబడి మరింత పెరిగింది. పంటలో కొంత భాగం తోటి రైతులకు విత్తనాల కోసం అమ్ముతున్నాడు. మిగతా పంటను మార్కెట్లో అమ్ముతున్నాడు. రఘును చూసి ఎంతోమంది రైతులు నీళ్లున్నా కూడా మిల్లెట్స్ సాగు చేయడానికే ఇష్టపడుతున్నారు. హోండూరేలో ఇప్పుడు చాలామంది రైతులు అండు కొర్రలు పండిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
కొన్నేండ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్‌కి డిమాండ్ ఏర్పడింది. అందులోనూ కరోనా తర్వాత డిమాండ్ మరింత పెరిగింది. కానీ.. డిమాండ్‌కు సరిపడా ప్రొడక్షన్ లేకపోవడంతో కొన్ని రకాల మిల్లెట్స్ ధరలు పెరుగుతున్నాయి. అందుకే ఈ వెలితిని భర్తీ చేసేందుకు యూఎన్వోతో పాటు చాలా దేశాలు పనిచేస్తున్నాయి. మిల్లెట్ సాగు విస్తీర్ణం, ప్రొడక్షన్లో మన దేశానికి 19 శాతం గ్లోబల్ షేర్ ఉన్నప్పటికీ దేశంలోని మొత్తం ఆహార ఉత్పత్తిలో అది చాలా తక్కువ. ప్రపంచంలో ఎక్కువగా సహార చుట్టు పక్కల ఉన్న ఆఫ్రికన్ దేశాల్లో, ఆసియా అంతటా ఉన్న చిన్న కమతాల రైతులే వీటిని పండిస్తున్నారు. ఈ పంటలు ఫుడ్, పశువుల మేత, బయో ఫ్యుయెల్స్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం ఏటా దాదాపు 170 లక్షల టన్నుల మిల్లెట్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. 2017–-18 నుండి 2020–-21 సంవత్సరాల్లో సగటున 11 శాతం విస్తీర్ణంలోనే మిల్లెట్స్ పండిస్తున్నారు. ఇది మొత్తం ఆహార ఉత్పత్తుల్లో కేవలం 6 శాతం మాత్రమే. అయినా.. ఆసియాలోని మిల్లెట్స్ ప్రొడక్షన్లో 80 శాతం ఇండియాదే. అందులోనూ రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశం 2021–-22లో 34.32 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన మిల్లెట్స్‌ని ఎగుమతి చేసింది. 2020–-21లో 26.97 మిలియన్ డాలర్లు, 2019–-20లో 28.5 మిలియన్ డాలర్ల విలువైన మిల్లెట్స్ ఎగుమతి చేసింది. ఇండియా నుంచి ఎక్కువగా యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, యూకే, అమెరికాలు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే.. ఇండోనేసియా, బెల్జియం, జపాన్, జర్మనీ, మెక్సికో, ఇటలీ, యూఎస్, ఇంగ్లాండ్, బ్రెజిల్, నెదర్లాండ్స్ దేశాలు ఇతర దేశాల నుంచి మిల్లెట్స్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి.
కొన్నేండ్ల నుంచి..
ఇప్పటికే కొన్నేండ్ల నుంచి మిల్లెట్స్‌కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కాకపోతే.. ఇదివరకు పల్లెల్లో ప్రజలే ఎక్కువగా వీటిని తినేవాళ్లు. ఇప్పుడు సిటీల్లో ఉండే ప్రజలు తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే.. ఇదివరకు ఇవి బియ్యం కంటే తక్కువ ధరకు దొరికేవి. కానీ.. ఇప్పుడు సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల దాదాపు చాలా రకాల మిల్లెట్స్ బియ్యం కంటే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. అందుకే ఆదాయం ఎక్కువగా ఉన్నవాళ్లే వీటిని తింటున్నారు. సాగు విస్తీర్ణం పెరిగి, ప్రొడక్షన్ పెరిగితే.. బియ్యం కంటే తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే వీటికి మార్కెట్ కూడా బాగానే ఉంది. కొన్ని కంపెనీలు ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ... రకరకాలుగా మార్కెట్ చేస్తున్నారు. ఉదాహరణకు బాజ్రా ఫ్లేక్స్, జొవార్ ఫ్లేక్స్, జొన్న పిండితో చేసిన పాన్‌కేక్ మిక్స్, రాగి, జోవర్ దోస మిక్స్, రాగితో చేసిన డెజర్ట్ మిక్స్ లాంటివి మార్కెట్లో ఉన్నాయి. అందులోనూ కొన్ని బ్రాండ్‌లు ‘‘క్లీన్ లేబుల్ సర్టిఫికెట్”, “వంద శాతం హోల్‌గ్రెయిన్ సర్టిఫికెట్” తీసుకుని ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తెస్తున్నాయి.
మన దగ్గర పండించేవి...
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయంగా పండే అనేక రకాల మిల్లెట్స్ ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఎక్కువగా జొన్నలు (జొవార్), సజ్జలు (పెర్ల్ మిల్లెట్), రాగులు(ఫింగర్ మిల్లెట్), లిటిల్ మిల్లెట్ (చామలు), ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కొర్రలు), ప్రోసో మిల్లెట్ (వరిగెలు), బార్న్యార్డ్ మిల్లెట్ (ఊదలు), కోడో మిల్లెట్(అరికలు) పండిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటి రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జొన్నలు, సజ్జలు, రాగుల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 2017–18లో జొన్నల కనీస మద్దతు రేటు 1,725 రూపాయలు ఉండేది. 2022–23కి 2,990 రూపాయలకు పెరిగింది. అలాగే సజ్జల రేటు 1,425 నుంచి 2,350కి, రాగుల రేటు 1,900 నుంచి 3,578కి పెరిగాయి.
మిల్లెట్ మిషన్
మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, వినియోగం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగానే మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తోంది. మిల్లెట్స్ ప్రమోషన్ కోసం దేశంలోని కొన్ని సిటీల్లో మిల్లెట్ ఎక్స్‌పోలను ఏర్పాటు చేస్తున్నారు. తంజావూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మిల్లెట్ ప్రాసెసింగ్ (ఐఎస్‌ఎంపీ)ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. మిల్లెట్ మిషన్‌లో భాగంగా ఇండియాని గ్లోబల్ మిల్లెట్స్ హబ్‌గా మార్చాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాదు.. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్‌లోని అఖిల పక్ష ఎంపీలకు మిల్లెట్స్ ఫుడ్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జరిగే జీ– 20 సదస్సులో కూడా అన్ని రకాల ఫుడ్ వెరైటీలను మిల్లెట్స్తోనే వండుతామని కేంద్ర మంత్రి జై శంకర్ చెప్పారు.
బడ్జెట్లో
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా వ్యవసాయం, రైతుల కోసం కొన్ని పథకాలను ప్రస్తావించారు. అందులో దేశ వ్యాప్తంగా రైతులను ఎట్రాక్ట్ చేసిన పథకం ‘శ్రీ అన్న యోజన’. మిల్లెట్స్ సాగు విస్తీర్ణం, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఈ స్కీంని తీసుకొచ్చారు. ప్రసంగంలో మిల్లెట్స్‌ని ‘శ్రీ అన్న’ అన్నారు. అలా పలకడం వెనక ఉన్న కారణాన్ని తర్వాత మోదీ కర్నాటకలో ఒక బహిరంగ ర్యాలీలో చెప్పారు. కర్నాటకతోపాటు సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మిల్లెట్స్‌ని ‘సిరి ధాన్యం’ అని పిలుస్తారు. దాన్ని వ్యవహారికంలో ‘శ్రీ ధాన్యం’ కూడా అంటారు. అందుకే మిల్లెట్స్‌ని ‘శ్రీ అన్న’ అని పిలుస్తున్నారు. అంతేకాదు ‘శ్రీ అన్న’ అంటే అన్ని ఆహార ధాన్యాల్లో అత్యుత్తమమైనది అనే అర్థం కూడా ఉందన్నారు. మిల్లెట్స్ రుచిగా ఉండడంతో పాటు వాటిలో పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల కర్ణాటకలో ‘శ్రీ ధాన్యం’ అని పిలుస్తున్నారని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో
సెంట్రల్ గవర్నమెంట్ మిల్లెట్ మిషన్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిల్లెట్స్ సాగు, వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కర్నాటకలో ఈ మధ్య జరిగిన ఎన్నికలప్పుడు బీజేపీ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 5 కిలోల బియ్యంతో పాటు 5 కిలోల మిల్లెట్స్ అందిస్తామని చెప్పారు.
సాయుధ బలగాలకు మిల్లెట్స్
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)కు పెట్టే భోజనంలో 30శాతం మిల్లెట్స్ అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మధ్యే నిర్ణయం తీసుకుంది. అందుకోసం మిల్లెట్ బేస్డ్ మెనూను రెడీ చేయాలని బలగాలకు చెప్పింది.
యూపీలో ప్రత్యేక పథకం
ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా మిల్లెట్స్‌ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ‘‘ఉత్తరప్రదేశ్ మిల్లెట్స్ రివైవల్ ప్రోగ్రామ్”లో భాగంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో రైతులకు ప్రతి సంవత్సరం మిల్లెట్స్ విత్తనాల మినీ కిట్‌ను ఫ్రీగా ఇస్తారు. ఈ ఏడాది మొదలైన ఈ పథకం నాలుగేండ్ల వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
లాభాలెన్నో..
ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప కానుకలు మిల్లెట్స్. కానీ.. మనలో చాలామంది వాటిని పట్టించుకోవడంలేదు. అవి మన బాడీకి అనేక రకాల రోగాలను ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి.
అందానికి కూడా..
మిల్లెట్స్‌లో విటమిన్–సి, ఇ ఉంటాయి. ఇవి నేచురల్ సన్‌స్క్రీన్‌లుగా పనిచేస్తాయి. ఎండవల్ల స్కిన్ దెబ్బతినకుండా, డల్‌గా, డార్క్‌గా మారకుండా కాపాడతాయి. కొత్త స్కిన్ సెల్స్ పుట్టేందుకు సాయం చేస్తాయి. అంతేకాదు.. మిల్లెట్స్ స్కిన్‌ని ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. పొడిబారకుండా కాపాడతాయి. యాంటీ ఏజింగ్‌కు కూడా బాగా పనికొస్తాయి. వయసు మీద పడిందనడానికి సూచనలు.. నల్ల మచ్చలు, మొటిమలు, ముడతలు. అవి రాకుండా మిల్లెట్స్ స్కిన్‌ని కాపాడతాయి. రోజూ మిల్లెట్స్ తింటే జుట్టుకు కూడా బలం. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇవి తలపై బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతాయి. దాని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.
వెయిట్ కంట్రోల్
బరువు తగ్గాలి అనుకునేవాళ్లకు మిల్లెట్స్ బెస్ట్ ఫుడ్. రోజూ ఏదో ఒక రకమైన మిల్లెట్స్ తింటే తక్కువ టైంలోనే ఐడియల్ వెయిట్‌కి వచ్చేస్తారు. మిల్లెట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మిల్లెట్స్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా గ్లూటెన్ ఉండదు. అందువల్ల బరువు తగ్గడానికి సాయం చేస్తాయి. అంతేకాకుండా మిల్లెట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఓవర్ ఈటింగ్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా కొర్రలు, రాగులు, సజ్జలు బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి.
సిలియక్ డిసీజ్ రాదు
సిలియక్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డైజెస్టివ్ డిజార్డర్. గ్లూటెన్ ప్రొటీన్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిన్న పేగులు దెబ్బతింటాయి. పోషకాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి వాళ్లను గ్లూటెన్ ఫుడ్ తీసుకోవద్దని డాక్టర్స్ చెప్తుంటారు. మిల్లెట్స్‌లో గ్లూటెన్ ఉండదు. అందుకని వాటిని తింటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
షుగర్ కంట్రోల్
మిల్లెట్స్‌లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువ. అందువల్ల మిల్లెట్స్‌ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అని చెప్తుంటారు. వీటిని తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. బాడీలో షుగర్ లెవెల్స్‌ని మిల్లెట్స్ కంట్రోల్లో ఉంచుతాయి.
గుండెకు మంచివి
మిల్లెట్స్‌లో బీటా-గ్లూకాన్‌లు, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిడిన్స్, టానిన్‌లు, లిగ్నాన్స్, పోలికోసనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించడంలో సాయం చేస్తాయి. కాబట్టి రక్తనాళాలు గడ్డకట్టకుండా ఆరోగ్యంగా ఉంటాయి. దాంతో దాదాపు చాలా రకాల గుండె జబ్బులు రావు. పైగా మిల్లెట్స్ బాడీలో మంచి కొవ్వులను పెంచుతాయి.
పొట్టకు మేలు
మిల్లెట్స్‌లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహించే ఫుడ్‌గా చెప్తుంటారు. ఇవి తింటే మలబద్ధకం, ఉబ్బరం లాంటి కొన్ని జీర్ణ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. పేగు కదలికలు, పనితీరును కూడా మిల్లెట్స్ ఫుడ్ కంట్రోల్ చేస్తుంది.
కండరాలకు బలం
ఇందులో ఉండే ప్రొటీన్, అమైనో యాసిడ్ లైసిన్ కండరాలు బలంగా అయ్యేందుకు సాయం చేస్తాయి. మజిల్ డిగ్రేడేషన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. వీటిలోఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ బాడీలో సెరోటోనిన్ లెవెల్స్‌ని పెంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా నిద్రపడుతుంది.
నెలసరి నొప్పులకు..
ఆడవాళ్లు మిల్లెట్స్ తినడం వల్ల నెలసరి నొప్పుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. మిల్లెట్స్‌లో మెగ్నీషియం బాగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే నెలసరి నొప్పి తగ్గుతుందని డాక్టర్లు చెప్తుంటారు. మిల్లెట్ ఆహారం గర్భాశయంలో కండరాలు రెస్ట్ తీసుకోవడానికి సాయం చేస్తుంది.
ఇమ్యూనిటీ
మిల్లెట్స్ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్. అందుకే కరోనా టైంలో వీటిని తినేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయి. దీర్ఘకాలికవ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
గర్భిణులకు బెస్ట్ ఫుడ్
గర్భిణులకు మిల్లెట్స్ మంచి ఫుడ్ అని పెద్దవాళ్లు చెప్తుంటారు. ముఖ్యంగా రాగులు ఎక్కువగా తినాలి అంటారు. ఎందుకంటే.. ఇది ఆ టైంలో కావాల్సిన క్యాల్షియం, ఐరన్ లాంటి వాటిని ఎక్కువగా ఇస్తుం ది. షుగర్, బీపీని కంట్రోల్ చేస్తుంది.
క్యాన్సర్‌కు దూరంగా..
మిల్లెట్స్‌లో ఫైబర్స్, ఫైటోన్యూట్రియెంట్స్ ఉండడం వల్ల వీటికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. టాక్సిన్‌కు గురైనప్పుడు దెబ్బతిన్న డీఎన్ఏని రిపేర్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఫైటోన్యూట్రియెంట్‌పెద్దపేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్‌ని దరిచేరనివ్వదు.
వేల శాంపిల్స్
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ కలెక్షన్‌ని సేకరించి పెట్టారు. ప్రస్తుతం ఇక్రిశాట్లో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన కొన్ని వేల యూనిక్ శాంపిల్స్ ఉన్నాయి. ప్రతి దానికి ప్రత్యేకమైన రుచి, టెక్స్చర్స్, కలర్, న్యూట్రియెంట్ వ్యాల్యూస్ ఉంటాయి. ఇక్రిశాట్ సేకరించిన వాటిలో చాలా రకాలు ఇప్పటికే అంతరించి పోయాయి.
రీసెర్చ్ మన దగ్గరే
మిల్లెట్స్ మీద పూర్తి స్థాయి పరిశోధనలు చేసే ‘‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్’’ (ఐఐఎంఆర్) హైదరాబాద్‌లోనే ఉంది. శ్రీ అన్న పథకంలో భాగంగా దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతామని నిర్మాలాసీతారామన్ ప్రకిటించారు. ఇండియాను మిల్లెట్స్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ఈ ఇనిస్టిట్యూట్లోనే పరిశోధనలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) కింద పనిచేస్తోంది. మిల్లెట్స్ ఉత్పత్తి పెంచడం, కొత్త వంగడాలను తీసుకురావడం లాంటి లక్ష్యాల కోసం ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు 35 కొత్త జొన్న వంగడాలు తీసుకొచ్చారు.
తక్కువ టైంలో కష్టమే
మిల్లెట్స్ సాగు విస్తీర్ణం పెంచడం, వాటిని వినియోగించడం.. లాంటి మార్పులు తక్కువ టైంలో రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే రైతులు ఎన్నో ఏండ్ల నుంచి వరి, గోధుమలనే పండిస్తున్నారు. వాటినే తింటున్నారు. కాబట్టి వీటి వినియోగాన్ని నెమ్మదిగా పెంచాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అందుకోసం ముందుగా పిల్లలకు వీటిని తినడం అలవాటు చేయాలి. దీనివల్ల పౌష్టికాహారం అందించినట్టు కూడా ఉంటుంది. 2021-22 లెక్కల ప్రకారం ఇండియాలోని 14.89 లక్షల స్కూళ్లలో 26.52 కోట్ల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీటితోపాటు మరో 14 లక్షల ప్రి–స్కూల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని మిల్లెట్స్‌కు మార్కెట్‌గా మార్చుకోవచ్చు. వాటిలో చదువుకునే పిల్లలకు మిల్లెట్స్ ఫుడ్ పెడితే సరిపోతుంది. అంగన్‌వాడీకి వచ్చే ప్రతి చిన్నారికి రోజూ ఒక గ్లాసు పాలు, గుడ్డుతోపాటు ఆయా ప్రాంతాల్లో దొరికే మిల్లెట్స్‌తో చేసిన కిచిడీ, దోసెలు, ఎనర్జీ బార్లు చేసి పెడితే చాలు. వాళ్లకు న్యూట్రియెంట్స్ ఫుడ్‌ని అందించినట్టు, మిల్లెట్ సాగు చేసే రైతులను ప్రోత్సహించినట్టు అవుతుంది. దీని ద్వారా రేషన్ బియ్యం, గోధుమల సరఫరాలో కూడా పెద్దగా మార్పులు ఉండవు.
మిల్లెట్ మ్యాన్
మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. రకరకాల కారణాల వల్ల ఆ విషయాన్ని చాలామంది గుర్తించడంలేదు. అంతెందుకు డాక్టర్లు కూడా చెప్పడం లేదు. అందుకే ప్రజలను తట్టిలేపడమే పనిగా పెట్టుకుని పాతికేండ్ల నుంచి మిల్లెట్స్ మీద అవగాహన కల్పిస్తున్నారు ఖాదర్ వలి. అందుకే ఆయన్ని అందరూ ‘మిల్లెట్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. ఖాదర్ చేసిన కృషికి మెచ్చిన గవర్నమెంట్ ఈ మధ్యే ‘పద్మశ్రీ’తో గౌరవించింది.
ఖాదర్ వలి ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో పుట్టారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి స్టెరాయిడ్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఒరెగాన్‌లోని బీవర్టన్‌లో పర్యావరణ శాస్త్రంలో మూడు సంవత్సరాల పాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఉన్నారు. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నాలుగేండ్లు సైంటిస్ట్‌గా పనిచేశారు. తర్వాత డ్యూపాంట్ కంపెనీ కోసం అమెరికాలో నాలుగు సంవత్సరాలు పనిచేశారు. అప్పుడే ఆయన అనేక రీసెర్చ్‌లు చేసి మిల్లెట్స్‌లో ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉద్యోగం వదిలేసి 1997లో ఇండియాకు తిరిగొచ్చారు. పాతికేళ్లుగా కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ప్రాధాన్యతను ప్రజలకు చెప్తున్నారు. ప్రస్తుతం మైసూరులో స్థిరపడ్డారు.
మిల్లెట్ విలేజ్
మేఘాలయ రాష్ట్రంలో ఈస్ట్ కాశీ హిల్స్ ప్రాంతంలో నాంగ్‌ట్రా అనే చిన్న గ్రామం ఉంది. ఆ ఊళ్లో దాదాపు 200 మంది ఉంటున్నారు. ప్రపంచం.. ఆహార అవసరాలను ఎలా తీర్చుకోవాలో ఈ గ్రామం చెప్తోంది. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీకి పరిష్కారాలను చూపిస్తోంది. బయటి ప్రపంచం మీద ఆధారపడకుండా వాళ్లకు కావాల్సినవి వాళ్లే పండించుకుంటున్నారు. ఫుడ్, డ్రింక్స్ అన్నీ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటారు. ఎన్నో ఏండ్లుగా వాళ్లు మిల్లెట్స్నే తింటున్నారు. గోధుమలు, వరితో పోలిస్తే ఇవి ఆ కొండ ప్రాంతంలో బాగా పండుతాయి. ఎలాంటి మందులు అవసరం లేదు. పైగా మిల్లెట్స్‌ని స్టోర్ చేసుకోవడం కూడా ఈజీ. అందుకే కరోనా లాక్డౌన్ టైంలో ఫుడ్ సప్లై చెయిన్ కుప్ప కూలినా వీళ్లు హాయిగా బతకగలిగారు. అందరిలా గోధుమలు, బియ్యంపై ఆధారపడితే ఇబ్బందులు ఉండేవి. వాళ్లు పండించుకున్నవే తింటారు. మరుసటి ఏడు విత్తేందుకు కొన్ని దాచుకుంటారు. మిగిలినవి అమ్ముకుంటారు. వాటితోనే రొట్టెలు, సూప్‌లు, బిస్కెట్లు తయారుచేసుకుంటారు. 1970ల మొదట్లో దాదాపు అంతరించిపోయిన మిల్లెట్ ‘రైషన్’ని కూడా ఇక్కడ పండిస్తున్నారు.
మిల్లెట్స్ ఫుడ్‍కి డిమాండ్
వరంగల్, వెలుగు: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోని హోటల్స్‌లో మిల్లెట్స్ ఫుడ్ సెర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో మిల్లెట్స్ ఫుడ్‍కి డిమాండ్ బాగా పెరుగుతోంది. సిటీలో మిల్లెట్స్ ఫుడ్ హోటల్స్ మూడు ఉన్నాయి. రోజు రోజుకూ ఈ హోటల్స్‌కి రద్దీ పెరుగుతోంది. కొర్రలు, అరికెలు, ఊదలు, జొన్న, మొక్కజొన్న, సామలు వంటి చిరు ధాన్యాలతో పాటు పెసర్లు, శనగల మొలకలతో చేసే టిఫిన్స్ ఇక్కడ ఫేమస్. వాటిలో సామ ఇడ్లీ, సామ దోస, సామ వడ, సామ బీట్ రూట్ దోశ, ఊదల పిండి దోశ, మొలకల దోశలను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. హెల్త్ కోసమే కాకుండా వీటిని రుచి కోసం తినేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. మిల్లెట్స్, తాటి బెల్లం కలిపి తయారు చేసే లడ్డూలు, బిస్కెట్స్‌ని స్నాక్స్‌గా అమ్ముతున్నారు. వరంగల్‌లోని ఒక్కో మిల్లెట్స్ టిఫిన్ సెంటర్‍లో రోజూ 400 వరకు టిఫిన్స్ అమ్ముడుపోతున్నాయి.
సేంద్రియ పద్ధతుల్లో
వరంగల్‌లో మిల్లెట్స్ ఫుడ్ హోటల్ నడిపే శివకృష్ణ వ్యాపారం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నేను మొదట్లో చిరు ధాన్యాల స్పెషాలిటీ గురించి తెలుసుకున్నా. ఎంబీఏ పూర్తయ్యాక 2015లో ధ్యాన ప్రకృతి హోటల్ పెట్టా. ప్రస్తుతం మా హోటల్లో రెగ్యులర్ హోటల్ కంటే ఎక్కువ వ్యాపారం అవుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవాళ్లు, కొత్త రుచులు కావాలని ఫీల్ అయ్యేవాళ్లు ఎక్కువగా వస్తుంటారు. సేంద్రియ పద్ధతుల్లో పండించే మిల్లెట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. రోజూ దాదాపు 400 నుంచి 500 టిఫిన్స్ అమ్ముతున్నాం. చిరు ధాన్యాల తిండికి ఒక్కసారి అలవాటు పడితే ఇక రెగ్యులర్ ఫుడ్ జోలికి వెళ్లరు”అన్నాడు శివకృష్ణ.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో కూడా మిల్లెట్స్ సెర్వ్ చేసే హోటళ్లు చాలానే ఉన్నాయి. వాటిలో ఎమెరాల్డ్ స్వీట్ షాప్ బాగా ఫేమస్. ఇందులో రకారకాల మిల్లెట్స్ టిఫిన్స్, శ్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. వాళ్లు సర్వ్ చేసే ఫుడ్ వండడానికి కావాల్సిన ధాన్యాలు, మిల్లెట్స్‌ని వాళ్లే ఆర్గానిక్‌గా పండిస్తారు. వాటిని కస్టమర్లకు కూడా అమ్ముతున్నారు. వీళ్లు ముఖ్యంగా గోవు ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు.
కరుణాకర్ మానెగాళ్ల