వేములవాడ, వెలుగు: రాజన్న ఆలయ పరిధిలో తిప్పాపూర్‌లో నిర్వహిస్తున్న గోశాలలోని రాజన్న కోడెలకు గురువారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఇటీవల కురిసిన వానలతో రాజన్న గోశాల బురదమయంగా మారిన విషయం తెలిసిందే. బురద నీటిలో కోడెలు అనారోగ్యం బారినపడుతుండడంతో ఈనెల 24న ‘బురదలో రాజన్న కోడెలు’ హెడ్డింగ్‌తో ‘వెలుగు’ పేపర్‌లో కథనం పబ్లిష్ అయింది.
దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలతో గురువారం వెటర్నరీ డాక్టర్లు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్లు ప్రశాంత్ రెడ్డి, శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గోశాలలోని సుమారు 1500 కోడెలకు 20 మంది డాక్టర్లు సిబ్బంది కోడెల హెల్త్ చెక్ చేశారు. అనారోగ్య సమస్యలున్న కోడెలకు ఇంజక్షన్లు, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ప్రతాప నవీన్, పర్యవేక్షకుడు నాగుల మహేశ్ ఉన్నారు.