విశ్లేషణ :ఉద్యోగులకు అక్కరకు రాని హెల్త్ కార్డులు

విశ్లేషణ :ఉద్యోగులకు అక్కరకు రాని హెల్త్ కార్డులు

రాష్ట్రంలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉపయోగపడటంలేదు. ట్రీట్​మెంట్​ కోసం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళుతుంటే వారు హెల్త్​ కార్డులను అనుమతించడం లేదు. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గాలిలో దీపంలా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 డిసెంబర్‌‌‌‌ 5న ఉద్యోగులకు ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీమ్(ఈహెచ్ఎస్)​ కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌‌‌‌ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ఆస్పత్రుల నెట్‌‌‌‌ వర్క్‌‌‌‌ ద్వారా నగదు రహిత చికిత్సలను పొందే వీలు ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ పనిచేసేది. ఇదే పథకాన్ని కొన్ని మార్పులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉద్యోగుల నుంచి ఏవిధమైన ప్రీమియం ప్రస్తుతం వసూలు చేయడం లేదు. కానీ కొన్ని కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రులు తమకు లాభం కలిగించే ట్రీట్‌‌‌‌మెంట్లను మాత్రమే ఈహెచ్​ఎస్‌‌‌‌  కింద అందిస్తున్నాయి. ఏ ఆస్పత్రిలో ఏ చికిత్సలు చేస్తున్నారనే అంశంపై అవగాహన లేక ఉద్యోగులు, ఫించనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సర్కారుకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు.
 

కార్డులున్నా ఇబ్బందులు తప్పట్లేదు
రాష్ట్రంలో హెల్త్‌‌‌‌ కార్డులు ఉన్నా.. ఉద్యోగులు, పింఛనుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్‌‌‌‌ కార్డులను జారీ చేసింది. ప్రాథమికంగా ఓపీ స్థాయిలో చూపించుకునేందుకు ఆయా జిల్లాల్లో 14 వెల్‌‌‌‌నెస్‌‌‌‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోగం ముదిరి, అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రుల్లో ఇన్‌‌‌‌ పేషెంట్లుగా చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎక్కువ మంది ఔట్‌‌‌‌ పేషెంట్లుగా డాక్టర్లను సంప్రదించి సిఫారసు చేసిన పరీక్షలు చేయించుకుని మందులను వాడుతున్నారు. డయాబెటీస్‌‌‌‌ రోగులైతే వారికి కేటాయించిన నిర్దిష్ట గడువుల్లో మందులు పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా వెల్‌‌‌‌నెస్‌‌‌‌ సెంటర్లు పరీక్షల సంఖ్యను తగ్గించాయి. ఆ కొన్ని పరీక్షలు కూడా చేయకుండా కేవలం నమూనాలను సేకరించే కేంద్రాల స్థాయికి తగ్గించారు. సేకరించిన నమూనాలను తెలంగాణ డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు పంపిస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఇక డాక్టర్లు సిఫారసు చేసిన మందులు పూర్తిగా దొరక్క బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర సర్కార్‌‌‌‌ పదే పదే చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో ఏదోలా సర్దుకుపోయినా.. అత్యవసర పరిస్థితుల్లోనూ హెల్త్‌‌‌‌ కార్డు అక్కరకు రాకపోవటంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు.
 

కొర్రీలు పెడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు
హెల్త్​కార్డు ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చికిత్స కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో, ఉద్యోగులు అపరిమిత చికిత్స సౌకర్యాలను పొందగలుగుతారు. లబ్ధిదారుడు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో ఏదైనా వ్యాధికి చికిత్స పొందవచ్చు. ప్రభుత్వ టీచర్లు కూడా ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు. రిటైర్డ్ అయిన తర్వాతా సేవలను అందిస్తున్న ప్రభుత్వ అధికారులు కూడా ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షల మంది పెన్షనర్లు హెల్త్‌‌‌‌ కార్డులను కలిగి ఉన్నారు. పేషెంట్‌‌‌‌ పరిస్థితి సీరియస్‌‌‌‌ అయితే  కార్పొరేట్‌‌‌‌, సూపర్‌‌‌‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ స్పెషాలిటీ డాక్టర్లు, ఇతర సౌకర్యాలుండటంతో పలువురు డాక్టర్లు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే కార్పొరేట్‌‌‌‌ ఆస్పత్రులు హెల్త్‌‌‌‌ కార్డులను అనుమతించటం లేదు. ముందుగా ఓపీ చూపించుకోవాలని, అది కూడా కేటాయించిన రోజుల్లోనే చూపించుకోవాలని చెబుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.