రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు
  • ప్రతి జిల్లాలో పేరెంటివ్‌‌ కేర్‌‌ సెంటర్లు
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

మెదక్, వెలుగు : రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మెదక్‌‌ పట్టణంలో ఏర్పాటు చేసిన మెడికల్‌‌ కాలేజీని గురువారం ఇన్‌‌చార్జి మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీటింగ్‌‌లో రాజనర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో డయాబెటిస్, క్యాన్సర్, బీపీ, హార్ట్‌‌ ఎటాక్‌‌ సమస్యలు బాగా పెరుగుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో పేరెంటివ్‌‌ కేర్‌‌ సెంటర్‌‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ప్రజల సౌకర్యార్థం మొబైల్‌‌ స్క్రీనింగ్‌‌ యూనిట్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎక్కువగా ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. యాక్సిడెంట్‌‌లో గాయపడిన వారికి గోల్డెన్‌‌ అవర్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ చేసేందుకు 74 ట్రామా కేర్‌‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం హైదరాబాద్‌‌ వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే అన్ని సేవలు అందేలా సబ్‌‌ సెంటర్‌‌, పీహెచ్‌‌సీ, సీహెచ్‌‌సీ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు.

రూ. 185 కోట్లతో 20 ఎకరాల్లో మెదక్‌‌ మెడికల్‌‌ కాలేజీ నిర్మాణానికి నెల రోజుల్లో భూమి పూజ చేస్తామని తెలిపారు. మెడికల్‌‌ కాలేజీకి అనుబంధంగా 220 బెడ్స్‌‌ హాస్పిటల్‌‌తో పాటు వచ్చే ఏడాది నర్సింగ్, పారా మెడికల్‌‌ కాలేజీ మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్‌‌ ఎంపీ రఘునందన్‌‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌‌రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌రావు, కార్పొరేషన్ చైర్మన్‌‌ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ చంద్రపాల్, డీఎంఈ వాణి, కలెక్టర్‌‌ రాహుల్‌‌రాజ్‌‌, మెడికల్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ రవిందర్‌‌కుమార్‌‌, డీఎంహెచ్‌‌వో శ్రీరాం, డీసీహెచ్‌‌ శివదయాల్‌‌ పాల్గొన్నారు.