దవాఖాన్లకు గర్భిణుల తరలింపు.. సిబ్బంది సెలవులు రద్దు

హైదరాబాద్, వెలుగు: డెలివరీ డేట్‌ దగ్గరలో ఉన్న 176 మంది గర్భిణులను గురువారం దవాఖాన్లకు తరలించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. వరదల వల్ల రోడ్ల కనెక్టివిటి దెబ్బతిని, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున గర్భిణుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు 327 మందిని, 27వ తేదీన 176 మందిని దవాఖాన్లకు తరలించామని తెలిపారు. 

ALSO READ:వరద బాధితులకు సాయం చేయండి

వీరికి వసతి, భోజనం, సౌకర్యాలను కల్పించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆదేశించామని డీహెచ్ వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవల పరంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (040 -24651119) కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.