నల్గొండ జిల్లాలో సాధారణ జ్వరాలే !

  • వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి సర్వేలో వెల్లడి
  • చికెన్​గున్యా, డెంగ్యూ ఫీవర్స్​నిల్​
  • 7.29 లక్షల మందికి పూర్తయిన టెస్ట్​లు
  • సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగులు  4,715 మందే
  • జిల్లా మొత్తంలో డెంగ్యూ కేసు ఒక్కటే 
  •  ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికెన్​గున్యా, డెంగ్యూ కేసులు నమోదు  

నల్గొండ, వెలుగు :  నల్గొండ జిల్లాలో సాధారణ జ్వరాలే తప్ప డెంగ్యూ, చికెన్​గున్యా వంటి ప్రమాదకరమైన జ్వరాలు ఏమీ లేవని వైద్యారోగ్యశాఖ తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆశాలు, మున్సిపల్ సిబ్బంది కలిసి గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. జిల్లాలో 17,08,073 జనాభాకు ఇప్పటివరకు 7,29,933 మందికి టెస్ట్​లు చేశారు. దీంట్లో కేవలం 4,715 మంది మాత్రమే సాధారణ జ్వరాలో బాధపడుతున్నట్టు గుర్తించారు. జిల్లాలో ఒకే ఒక్క డెంగ్యూ కేసు మాత్రమే నమోదైంది.

అంటే మొత్తం జనాభాలో 42 శాతం మందికి టెస్ట్​లు చేయగా, కేవలం 0.64 శాతం మంది మాత్రమే జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామాల్లో ఈనెల 11 నుంచి సర్వే మొదలు పెట్టగా, పట్టణాల్లో 26 నుంచి ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో మొత్తం జనాభా 4,25,3 69 మంది ఉండగా, 3,32,932 మందికి టెస్ట్​లు చేశారు. దీంట్లో కేవలం 434 మంది మాత్రమే జర్వంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో సర్వే కొనసాగుతోంది. ఇంకా 9,78,140 మందికి టెస్ట్​లు చేయాల్సి ఉంది. మొత్తం 4,39,302 ఇండ్లకు 2,68,588 సర్వే కంప్లీట్​చేశారు. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల కిటకిట..

నల్గొండ, మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులు కిటకిటలాడుతున్నారు. నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే రోజుకు రెండు, మూడు చికెన్ గున్యా కేసులు నమోదవుతున్నాయని, ఈ సీజన్ లో ఇప్పటికే డెంగ్యూ లక్షణాలు కలిగిన పేషెంట్లు అనేక మంది తమ వద్దకు వచ్చారని, వాళ్లకు ఏలీసా టెస్ట్​లు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని వైద్యులు చెబుతున్నారు. సాధారణ జ్వరాలతో పోలిస్తే చికెన్​గున్యూ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో అపరిశుభ్రత వాతావరణం వల్ల మళ్లీ చికెన్​గున్యా విజృంభిస్తోందని, పేషెంట్లకు వొళ్లు నొప్పులు, చలిజ్వరంతో బాధపడుతున్నారని ప్రైవేట్ డాక్టర్లు చెబుతున్నారు. కేవలం పారిశుధ్యం లోపం వల్ల దోమలు వ్యాపించి చికెన్ గున్యా మళ్లీ విజృంభిస్తోందని వైద్యులు చెప్పారు.

పల్లెల్లో పరిశుధ్య లోపం..

వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు, ఆశాలు, మున్సిపల్ సిబ్బంది కలిసి నిర్వహిస్తున్న సర్వేలోనూ పారిశుధ్య లోపం ప్రధానంగా గుర్తించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడిపడితే అక్కడ రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తుండటం, డ్రైనేజీ కాల్వలు శుభ్రంగా లేకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి చికెన్ గున్యా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీల్లో పైసల్లేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం లేదు. మున్సిపాలిటీల్లోనూ ఫాగింగ్ చేయడం లేదని సర్వే ఆఫీసర్లు అంటున్నారు.