నిజామాబాద్, వెలుగు: ‘నువ్వు కొట్టినట్టు చేయ్ .. నేను ఏడ్చి నట్టు చేస్తా..’ అన్నట్టు ఉంది.. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, హెల్త్ డిపార్ట్ మెంట్ తీరు.. రూల్స్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఏడాది కాలంగా ఇలాంటి పరిస్థతులే కనిపిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ హాస్పిటళ్లలో నిపుణులు లేకుండా పీఎంపీలతో ట్రీట్ మెంట్ అందిస్తున్నారనే ఫిర్యాదులతో హెల్త్ డిపార్ట్ మెంట్ తనిఖీలు నిర్వహించింది. కానీ గతంలో నోటీసులు జారీ చేసిన హాస్పిటళ్లపైనే ఇప్పటికీ చర్యలు తీసుకోని ఆఫీసర్లు ఈసారి ఏం యాక్షన్ తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది.
కోవిడ్ ఫీజుల వాపస్ ఇయ్యలె..
కోవిడ్ టైంలో ప్రభుత్వం నిర్ధేశించిన దాని కంటే కార్పొరేట్ హాస్పిటళ్లలో నాలుగింతలు ఎక్కువగా ఫీజులు వసూలు చేశారు. ప్యాకేజీల పేరుతో రోగులను నిలుపు దోపిడీ చేశారు. ఒక్క రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. రెమిడిసీవిర్ ఇంజక్షన్ బ్లాక్ లో రూ.35 నుంచి రూ.50 వేల వరకు అమ్మకాలు చేశారు. జిల్లాలోని 57 హాస్పిటళ్లలో ఫీజుల రూపేణ మూడు నెలల్లో రూ.100 కోట్ల బిజినెస్ జరిగినట్లు అంచనా. అయితే అధిక ఫీజులపై రోగుల బంధువుల నుంచి స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ కు అప్పట్లో ఫిర్యాదు అందాయి. ఈ దోపిడీపై టాస్క్ ఫోర్స్ తో విచారణ చేపట్టి జిల్లాలోని 14 హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు కూడా అధికంగా వసూలు చేసిన ఫీజులు వాపస్ చేయాలని తీర్పునిచ్చింది. ఏడాది కాలంగా కోవిడ్ బాధితులు ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు. హైకోర్టు తీర్పును బేఖాతరు చేసిన 14 హాస్పిటళ్లపై వైద్యఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
తాజాగా మరో 15 హాస్పిటళ్లు
పీఎంపీలతో ట్రీట్ మెంట్ చేస్తున్నారని ఫిర్యాదులతో తాజాగా 8 బృందాలతో జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించారు. 15 హాస్పిటళ్లు నిబంధనలు పాటించడంలేదని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలతో వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ కు నివేదిక సమర్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. కానీ ఏడాది కాలంలో రెండు సార్లు తనిఖీలు చేపట్టినా చర్యలు తీసుకోవడంలో వైద్యఆరోగ్య శాఖ వెనుకడుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ లోని ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన సయ్యద్ నయీమొద్దీన్ కరోనా బారిన పడి ప్రతిభ హాస్పిటల్ లో చికిత్స పొందారు. 9 రోజుల పాటు చికిత్స పొందిన తనను జనరల్ వార్డులో ఉంచి ఏసీ గదిలో పేరుతో చీటింగ్ చేసి రూ.3,36,881 ఫీజు వసూలు చేశారని ఆయన హెల్త్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేశారు. నాలుగు గంటలు ఎక్కువగా ఉన్నారని వన్ డే బిల్లు అదనంగా వసూలు చేశారని పేర్కొన్నారు.. దీనిపై ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు ఆ హాస్పిటల్ కు నోటీసులు ఇచ్చి వదిలేసింది. తప్ప చర్యలు తీసుకోలేదు.. బాధిత కుటుంబానికి ఫీజు వాపసు ఇప్పించలేదు.