
అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశాలతో స్పెషల్ టీమ్స్
గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారంపై రోజువారీ సమీక్ష
మెరుగైన వైద్య సహాయంపై యాక్షన్ ప్లాన్
టెలీ గైనకాలజీ కన్సల్టెన్సీ సేవలు
అమలు కోసం హై పవర్ కమిటీ నియామకం
నిర్మల్, వెలుగు: జిల్లాలో గత కొంత కాలంగా మాతా, శిశు మరణాల సంఖ్య పెరిగిపోతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసవ మరణాలతోపాటు మాతా శిశు మరణాల కట్టడికి ‘అమ్మ రక్షిత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. జిల్లాలోని మెటర్నటీ హాస్పిటల్‌తో పాటు 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘అమ్మ రక్షిత’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు టీమ్‌గా ఏర్పడి వారి పరిధిలో మాత శిశు సంరక్షణ కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.
2163 మంది హై రిస్క్ గర్భిణులు
అమ్మ రక్షిత కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందేలా చేస్తూ.. వైద్య సహాయాన్ని కూడా అందించనున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించారు. జిల్లాలో మొత్తం 5037 మంది గర్భిణులు ఉండగా వీరిలో 2163 మంది హై రిస్క్‌తో ఉన్నట్లు గుర్తించి వారిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. కార్డియాలజిస్ట్ ద్వారా 2డి ఎకో కన్సల్టేషన్ సేవలు, వారానికోసారి గైనకాలజిస్ట్ ల ద్వారా టెలీ కన్సల్టేషన్ సేవలు, గర్భిణులందరికీ ఆయుష్ విభాగం డాక్టర్లతో యోగా సెషన్స్, తీసుకోవాల్సిన ఆహారంపై పోషకాహార నిపుణులతో సలహాలు అందించనున్నారు. ప్రసవానంతరం సైకోసిస్, ఆందోళన, డిప్రెషన్ తో బాధపడే తల్లులకు సైకియాట్రిస్ట్ ల చేత కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
హెల్ప్ డెస్క్ ద్వారా సేవలు
హై రిస్క్ ఉన్న వారికోసం గవర్నమెంట్ మెటర్నటీ హాస్పిటల్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదుగురు సిబ్బందిని నియమించి 24 గంటలపాటు వైద్య సలహాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని గవర్నమెంట్ మెటర్నటీ హాస్పిటల్ తో పాటు భైంసాలోని ఏరియా హాస్పిటల్ లో హెల్ప్ డెస్క్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హై రిస్క్ ఉన్నవారికి హెల్ప్ డెస్క్ సిబ్బంది ఫోన్‌చేసి వారికి, వారి కుటుంబసభ్యులకు వైద్య సలహాలు, సూచనలు చేయనున్నారు. నార్మల్ డెలివరీ కోసం వ్యాయామం, యోగా, రక్తహీనత లోపం ఉన్న మహిళలను గుర్తించి వారికి బలమైన పోషకాహారం వంటి అంశాలపై సలహాలు అందించనున్నారు. సైకాలజిస్ట్ ల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
హై పవర్ కమిటీ ఏర్పాటు
జిల్లాలో అమ్మ రక్షిత ప్రోగ్రాంను పకడ్బందీగా అమలు చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హెచ్ వోడీతో పాటు మెటర్నటీ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్, డీఎంహెచ్ వో, డీసీహెచ్ సభ్యులుగా ఉంటారు. వారంరోజులకు ఒకసారి ఈ కమిటీ హైరిస్క్ గర్భిణుల పరిస్థితులపై సమీక్ష జరపాల్సి ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు కౌన్సిలింగ్ నిర్వహించి సరైన పోషకాహారం అందుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి గర్భిణులకు పూర్తిస్థాయిలో సహకారం అందించేలా పనిచేయనుంది.
నార్మల్ డెలివరీల పైనే ప్రధాన దృష్టి
అమ్మ రక్షిత ప్రోగ్రాంలో నార్మల్ డెలివరీలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సిజేరియన్లను తగ్గించి నార్మల్ డెలివరీలను పెంచేందుకు సమిష్టిగా చర్యలు చేపట్టనున్నారు. పీహెచ్‌సీల స్థాయిలోనే గర్భిణులకు మెరుగైన వైద్య సహాయం అందించనున్నారు. నార్మల్ డెలివరీల కోసం వారిని మానసికంగా దృఢంగా చేయడం, వారి కుటుంబసభ్యులకు సైతం కౌన్సిలింగ్ నిర్వహించి వారిని ఆ దిశగా సంసిద్ధం చేయనున్నారు.
పకడ్బందీగా అమలు చేస్తాం
గర్భిణుల రక్షణ కోసం అమ్మ రక్షిత కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో నార్మల్ డెలివరీస్‌పై ఎక్కువగా దృష్టి పెడతాం. గర్భిణులకు వైద్య పరంగానే కాకుండా మానసికంగా, పోషకాహార పరంగా అన్ని రకాల సేవలు అందిస్తాం. ఈ కార్యక్రమం అమలు తీరును హై పవర్ కమిటీ ప్రతి వారం పర్యవేక్షిస్తుంది.- డాక్టర్ డి.సౌమ్య, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, నిర్మల్