తెలంగాణలో ప్రసూతి మరణాలు తగ్గినయ్

తెలంగాణలో ప్రసూతి మరణాలు తగ్గినయ్

సర్కారు‌‌‌‌కు ఆరోగ్య శాఖ అధికారుల రిపోర్టు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ప్రసూతి మరణాలు గతంలో పోలిస్తే బాగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా 2022–23లో 340 ప్రసూతి మరణాలు నమోదవగా, 2023-–24లో 260 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2023–24లో 21 జిల్లాల్లో మేటర్నల్  డెత్స్ తగ్గాయని, ఆరు జిల్లాల్లో పెరిగాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకో ఆరు జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

మరణాలు పెరిగిన లిస్టులో నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, ఆసిఫాబాద్  జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 27 మరణాలు నమోదవగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో ఒక్క మరణమే నమోదయింది. హన్మకొండ జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. మన దేశంలో కేరళలో అత్యంత తక్కువగా మదర్  మోర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్) నమోదవుతుండగా, ఆ తర్వాత  మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

సిజేరియన్లలో ఎక్కువ

నార్మల్ డెలివరీల సమయంలో కన్నా సిజేరియన్  డెలివరీల టైమ్​లోనే ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 260 మరణాల్లో 154 (71 శాతం) మంది మహిళలు సిజేరియన్  డెలివరీ తర్వాత చనిపోయారు. 62 మంది నార్మల్  డెలివరీ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 44  మంది డెలివరీ జరగడానికి ముందే మరణించారు.

గుండె సంబంధ వ్యాధులు, హైపర్ టెన్షన్, హెమరేజ్, అవాంఛనీయ అబార్షన్లు, సెప్సిస్  వంటి రోగాలు మాతృత్వ మరణాలకు ముఖ్య కారణాలుగా ఉన్నాయని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ఇంటి దగ్గరి నుంచి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌కు చేరే లోపలే 26 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాగా.. గర్భిణులను అంచనా వేసిన తేదీ కన్నా ముందే హాస్పిటల్‌‌‌‌కు చేర్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై సర్కారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.