డాక్టర్లకు సెలవులు రద్దు : మంత్రి దామోదర

డాక్టర్లకు సెలవులు రద్దు : మంత్రి దామోదర
  • వర్షాలు తగ్గే వరకు హాస్పిటల్స్‌‌‌‌ లోనే ఉండాలి: మంత్రి దామోదర
  • సీజనల్ వ్యాధులు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
  • మెడిసిన్స్‌‌‌‌, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డెంగ్యూ తగ్గుముఖం పట్టిందని, వారం క్రితం వరకు 7 శాతం ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు, ఇప్పుడు 6 శాతానికి తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 6,242 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, హైదరాబాద్‌‌‌‌లో అత్యధికంగా 2,073 కేసులు వచ్చాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫీవర్ సర్వే సెకండ్ రౌండ్ ప్రారంభించామని తెలిపింది.

ఇందులో భాగంగా 2,99,708 మంది జ్వర బాధితులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స అందజేశామని వెల్లడించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో జ్వరాలు, ఇతర అంశాలపై అధికారులతో హెల్త్‌‌‌‌ మినిస్టర్ దామోదర రాజనర్సింహా రివ్యూ చేశారు. డెంగ్యూ, జ్వరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. డెంగ్యూ తగ్గుముఖం పట్టిందని అధికారులు మంత్రికి తెలిపారు.

సీజనల్ వ్యాధులు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని పేషెంట్లకు సకాలంలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందేలా హెచ్‌‌‌‌వోడీలు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్ష సూచనల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్లు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌‌‌‌కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్‌‌‌‌ను ఆదేశించారు.  ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

గర్భిణులను ముందే తరలించండి..

ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌‌‌‌(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే హాస్పిటళ్లకు తరలించాలని మంత్రి దామోదర ఆదేశించారు. గర్భిణికి, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలన్నారు. అలాగే, అంబులెన్స్ సర్వీసులు, మెడిసిన్స్‌‌‌‌, టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పేషెంట్లకు అందించే ఆహారం, తాగు నీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గాక దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, దీంతో జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్‌‌‌‌కు అందించే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ వాణి, డీహెచ్ రవీందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు.