న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో కేంద్ర ఆరోగ్య శాఖకు రూ. 90,958.63 కోట్లు కేటాయించారు. 2023–24లో సవరించిన అంచనా రూ.80,517.62 కోట్ల కన్నా ఇది 12.96 శాతం ఎక్కువ. ఆయుష్ శాఖకు కేటాయింపులను రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,712.49 కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖకు కేటాయించిన రూ.90,958.63 కోట్లలో ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖకు రూ.87,656.90 కోట్లు (2023–24 బడ్జెట్ లో రూ.77,624.79 కోట్లు), హెల్త్ రీసెర్చ్ కు రూ.3,301.73 కోట్లు అలాట్ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన నేషనల్ హెల్త్ మిషన్ కు కేటాయింపులను రూ.36 వేల కోట్లకు (గత బడ్జెట్ లో రూ.31,550.87 కోట్లు) పెంచారు.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనకు కేటాయింపులను రూ.6,800 కోట్ల నుంచి రూ.7,300 కోట్లకు పెంచారు. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాంకు రూ.65 కోట్ల నుంచి రూ.90 కోట్లకు కేటాయింపులు పెంచారు. ఇక నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కు కేటాయింపుల్లో ఏమీ మార్పు లేకుండా రూ.200 కోట్లు అలాట్ చేశారు. అటానమస్ బాడీలకు రూ.18,013.62 కోట్లు (గత బడ్జెట్ లో రూ.17,250.90 కోట్లు) కేటాయించారు. ఈ సంస్థల్లో ఢిల్లీ ఎయిమ్స్ కు రూ.4,523 కోట్లు కేటాయించారు. భారతీయ వైద్య పరిశోధన మండలికి కేటాయింపులను రూ.2,295.12 కోట్ల నుంచి రూ.2,732.13 కోట్లకు పెంచారు.