- రాజకీయాల్లోకి వచ్చేందుకు నేను రెడీ
- స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రామాయణంలో ఒక రావణాసురుడున్నట్లుగానే కొత్తగూడెంలోనూ ఒక రావణాసురుడున్నాడని, పరోక్షంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఉద్దేశిస్తూ స్టేట్హెల్త్ డైరెక్టర్గడల శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు. గడల యువసేన, డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత కొత్తగూడెం క్లబ్లో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నానన్నారు. స్థానిక నాయకత్వం అలసత్వం మూలంగానే కొత్తగూడెం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు.
త్వరలో ‘గడప గడపకు గడల...ఇంటింటికి పెద్ద కొడుకులా’ అనే ప్రోగ్రాంను నియోజకవర్గంలో చేపట్టబోతున్నట్టు తెలిపారు. కొత్తగూడెంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడం లేదన్నారు. పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ల అధికారులు, సిబ్బందిని వాళ్ల డ్యూటీలు వాళ్లను చేయనీయడం లేదన్నారు. ఎవరూ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన కార్యక్రమాలు ఆపేది లేదన్నారు. వేడుకల్లో పలువురు సర్కారు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.