భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఆనాడు కట్టిన తాయత్తు మహిమ వల్లే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు అన్నారు. కొత్తగూడెంలోని కేసీ ఓఏ క్లబ్‌లో డాక్టర్ జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో ఆయన కలిసి నమాజ్ చేసి, తర్వాత మాట్లాడారు. ‘‘నేను పుట్టిన టైమ్‌లో అనారోగ్యానికి గురయ్యాను. చావు బతుకుల మధ్య ఉన్నాను. ఆ పరిస్థితుల్లో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడు కొత్తగూడెం పట్టణంలోని బడే మజీద్ దగ్గర ఇంట్లో వాళ్లు నాకు తాయత్తు కట్టించారు.
ఆ తాయత్తు మహిమతోనే నేను ఇప్పుడు ఈ స్థా యిలో ఉన్నా”అని ఆయన తెలిపారు. కొత్తగూడెంలో కొత్తగా ఈద్గాలు, కబరస్థాన్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల మందికి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారని తెలిపారు. రంజాన్ నెలలో మసీదులకు డబ్బులు ఇస్తున్నారని, అయితే అవి సరిపోవడం లేదని, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో కొత్తగూడెనికి సమయం ఆసన్నమైందని, ముస్లింలంతా తనతో కలిసి రావాలని కోరారు. దేశంలో కొన్ని శక్తులు మన మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. ప్రోగ్రాంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.