మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయని.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించారు. నిరంతరం బయట ఉండి విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా నీరు, శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‎లో ప్రెస్‎మీట్ నిర్వహించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

‘వడదెబ్బ తగిలిన వారిని వెంటనే నీడలోకి తీసుకువెళ్లి గాలి తగిలేలా చూడాలి. అరగంట లోపు లక్షణాలు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. రోడ్లపై విధులు నిర్వర్తించే వాళ్ళు ఎక్కువగా పానీయాలు తీసుకోవాలి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు వీలైనంత వరకు బయటకు రావొద్దు. కలుషితం అయిన నీరు వాడకూడదు. అదేవిధంగా నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మంచినీరు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాలలో 40  డిగ్రీలకు పైగా ఎండలు ఉంటున్నాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. 

రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉంది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గాయి. 20కి పైగా జిల్లాల్లో జీరో కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది. కొన్ని దేశాల్లో బిఏ2 వేరియెంట్ వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా తొలగిపోతుందని అనుకుంటున్నాం. కరోనా ఎండ్ స్టేజ్‎కి వచ్చింది. ఈ ఏడాది చివరకు కోవిడ్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా అందరూ సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించండి. వృద్ధులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కులు ధరిస్తే మంచిది. జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వ్యక్తిగత ఇష్టం. 18 ఏళ్ళు పైబడిన వారికి రెండు డోస్‎ల వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తైంది. రెండు ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్య ఆరోగ్యా శాఖ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. కోవిడ్ పూర్తిగా తొలగినట్టు భావించవచ్చు. గడిచిన రెండు ఏళ్ళు ఒక పీడకల లాంటివి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర దుష్పరిణామాలు, మరణాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. ఆరు కోట్ల 11 లక్షల కోవిడ్ డోస్‎లు ఇప్పటివరకు రాష్ట్రంలో పంపిణీ చేయగా.. ఒకే ఒక్క వ్యాక్సిన్ సబంధిత మరణం నమోదైంది. ప్రతి 9 నెలలకు ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహమ్మారి నుంచి మరింత రక్షణ పొందవచ్చు’ అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు.

For More News..

ఈ స్థాయిలో రిజర్వేషన్.. రాజ్యాంగ విరుద్ధం