భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేశ్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాయి, ఎన్ రవికుమార్, టి రవి, వంగా రవిశంకర్, వంశీ పాల్గొన్నారు.
బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లందు, వెలుగు: బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఎస్బీఐ ఆర్ఎం మురళీకృష్ణ సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సంజీవయ్య కాలనీలోని స్త్రీ స్వశక్తి భవనంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ ద్వారా గ్రూపులకు రూ.2.24 కోట్ల చెక్కును అందించినట్లు చెప్పారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే ఆ గ్రూపులకు రెట్టింపు రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఇల్లందు బ్రాంచ్ మేనేజర్ పూర్ణచందర్ ప్రధాన్, సుదిమల్ల బ్రాంచ్ మేనేజర్ రవిచంద్ర, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్, ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ కుమార్, బ్యాంకు సిబ్బంది జగదీశ్, ఏపీఎందుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనయ్
వైరా, వెలుగు: ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నాలుగో రోజు కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి ప్రారంభమైన ఆజాదీ కా గౌరవ్ యాత్ర వైరా, పినపాక, రెడ్డిగూడెం, తల్లాడ మీదుగా ఆర్పీ గార్డెన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా వైరా, పినపాక గ్రామాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నిర్బంధాలను లెక్కచేయకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. కేంద్ర విధానాలను ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ, సీబీఐ, పోలీస్ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఇక సీఎల్పీ నేతకు మహిళలు రాఖీలు కట్టారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాందాస్ నాయక్, బాలాజీ నాయక్, దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, శేఖర్, సంతోష్ పాల్గొన్నారు.
తగ్గని గోదావరి ఉధృతి
ఆందోళనలో తీరప్రాంత ప్రజలు
భద్రాచలం,వెలుగు: దిగువన ఏపీలోని శబరి ఉప నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి మూడు రోజులుగా 52 అడుగుల పైనే ఉంటుంది. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు 52.2 అడుగులకు తగ్గింది. కేవలం మూడు పాయింట్లు మాత్రమే తగ్గడం విశేషం. దీంతో మూడు రోజులుగా రోడ్లు నీట మునిగి ఉన్నాయి. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు ఐటీడీఏలో పీవో గౌతమ్ పోట్రు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 8639079188, 08743-232244 ఫోన్ల ద్వారా అవసరమైన సమాచారం పొందాలని ఆయన సూచించారు.
ఐటీడీఏ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు
డెయిలీ వేజ్ వర్కర్ల ర్యాలీ, ధర్నా
భద్రాచలం, వెలుగు: ఆశ్రమ పాఠశాలల్లో పని చేసే డెయిలీవేజ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ వర్కర్లు శుక్రవారం భద్రాచలంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏను ముట్టడించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రెండు జతల యూనిఫాం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న వర్కర్లు చర్ల రోడ్డులోని ఎంపీడీవో ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ 14 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆశ్రమ స్కూళ్లకు టీచర్లు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఏటీడబ్ల్యువో నర్సింహారావుకు వినతిపత్రం అందించారు. శనివారం కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు అప్పారావు, ఉపాధ్యక్షుడు బ్రహ్మాచారి, వర్కర్లు హీరాలాల్, కౌసల్య, పాయం ముత్తయ్య, ఈసం పద్మ, మంగమ్మ పాల్గొన్నారు.
స్త్రీనిధి సొమ్ము కాజేసిన వీవో ప్రెసిడెంట్
ఖమ్మం రూరల్, వెలుగు : మహిళా సంఘాలకు చెందిన స్త్రీ నిధి డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా వీవో అధ్యక్షురాలు సొంతానికి వాడుకుందని శుక్రవారం మహిళలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో 30 డ్వాక్రా పొదుపు సంఘాలు ఉన్నాయి. వీరంతా స్త్రీ నిధి నుంచి తీసుకున్న లోన్లకు సంబంధించి ప్రతి నెలా వీవో అధ్యక్షురాలు రేణుకకు రూ.1.50 లక్షలు కడుతున్నారు. ఆమె కొంతకాలంగా బ్యాంక్‌లో డబ్బులు జమ చేయకుండా సొంతానికి వాడుకుందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇలా ఇప్పటికే సుమారు రూ.15 లక్షల వరకు కాజేసిందని అంటున్నారు. సభ్యులకు తెలవకుండా డబ్బులు సొంతానికి వాడుకోవడమే కాకుండా తమ పేర్లపై కూడా లోన్లు తీసుకుని ఆ డబ్బులు వాడుకున్నట్లు ఆరోపిస్తున్నారు. లోన్ డబ్బులు బ్యాంక్‌లో జమ కావడం లేదని అధికారులు అడిగేంత వరకు తెలియలేదని వాపోతున్నారు. ఈ విషయమై ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లును వివరణ కోరగా పీడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్పారు. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.
16న కవి సమ్మేళనం
ఖమ్మం టౌన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు ఈ నెల 14లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూదన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 16న సాయంత్రం 6 గంటల నుంచి కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన కవులు, కవయిత్రులు తమ పేర్లను జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఇఫ్టూ స్టేట్ ట్రెజరర్ ఎండీ రాసుద్దీన్ డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని ఇఫ్టూ ఆఫీస్‌లో శుక్రవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పని చేస్తున్న డెయిలీ వేజ్కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు జె. సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్. విశ్వనాథం, నాయకులు రాంసింగ్, కొండపల్లి శ్రీనివాస్, లింగయ్య, రవి, మారుతీరావు పాల్గొన్నారు.