హెల్త్‌‌‌‌కార్డు పని చేయక పోలీసుల గోస


వనపర్తి, వెలుగు: కరోనా కంట్రోల్ కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ​24 గంటలు పనిచేస్తున్న పోలీసుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. డ్యూటీలో భాగంగా కరోనా బారినపడుతున్న సిబ్బందికి ప్రైవేట్​లో ట్రీట్​మెంట్ చేయించుకోవాల్సి వస్తే డిపార్ట్ మెంట్ తరఫున గానీ, సర్కార్ తరఫున గానీ చిల్లిగవ్వ సాయం అందడం లేదు. కరోనా సోకినవాళ్లకు పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున లక్ష రూపాయలు చెల్లిస్తామంటూ విడుదల చేసిన జీవో విడుదల అమలుకావడం లేదు. డిపార్ట్​మెంట్ ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్​మెంట్​కు పనికిరావడం లేదు. దీంతో పోలీస్​ కుటుంబాలు కరోనా చికిత్స కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసి  అప్పులపాలవుతున్నాయి. 

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ బీచుపల్లి టెన్త్ బెటాలియన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు కిందటేడాది జూలై 28న కొత్తగూడెంలో డ్యూటీ చేస్తున్నప్పుడు కరోనా సోకింది. దీంతో 14 రోజుల పాటు అక్కడే క్వారంటైన్​లో ఉండడంతో నెగటివ్ వచ్చింది. తర్వాత హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ వేశారు. 4 రోజుల తర్వాత మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో లీవ్​పై వచ్చి కొద్ది రోజులు సొంతూర్లో ఉన్నారు. జ్వరం తగ్గకపోవడంతో సికింద్రాబాద్ లోని నవోదయ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా ఎఫెక్ట్​తో అప్పటికే లంగ్స్ ఇన్​ఫెక్షన్ తీవ్రమవడం, ఆ ప్రభావం మెదడుపై పడడంతో పక్షవాతం వచ్చింది. అప్పటికే నవోదయ ఆస్పత్రిలో15లక్షల 30 వేల రూపాయల బిల్లు కట్టారు. ఆక్సిజన్ ఇతర అవసరాల కోసం మరో రూ.2 లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ మాములు మనిషి కాలేదు. దీంతో ఆయన భార్య శాంత, పిల్లలు తమ పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. తమ వద్ద ఉన్న డబ్బంతా ఇప్పటికే ఖర్చయిపోయిందని, ఏమీ చేయలేని స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని వేడుకున్నారు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ భర్తను బతికించుకోవాలని ఆమె తెలిసిన వారి వద్ద అప్పు చేసి, కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మొత్తం రూ. 4లక్షల 70 వేలు ఖర్చయింది. అయినా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో మళ్లీ ప్రతిమ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పుడు మళ్లీ 8 లక్షల 30 వేల రూపాయల బిల్లు వేశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం, కాళ్లు చేతులు కదలలేని స్థితిలో ఉండి మనుషులను సైతం గుర్తు  పట్టలేకపోవడంతో కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు.  ప్రస్తుతం ప్రతి రోజు బ్రెయిన్, స్పీచ్ థెరపీ కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తండ్రిపై ఉన్న ప్రేమతో పిల్లలు, భర్తను కాపాడుకోవాలన్న ఆశతో శాంత  అప్పులు తెచ్చుకుంటూ చికిత్స చేయిస్తున్నారు. పోలీస్ శాఖ నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పోలీస్ ఆరోగ్యభద్రతలో కరోనా ట్రీట్ మెంట్ చేర్చండి

నా భర్తకు డ్యూటీలోనే కరోనా సోకి, 14 రోజులకు నెగటివ్ వచ్చింది. కానీ పోస్ట్ కరోనా సమస్యలు వచ్చాయి. ప్రైవేట్​లో ట్రీట్​మెంట్​కు పోతే పోలీస్ ఆరోగ్య భద్రత కార్డు చెల్లదని చెప్పారు. ఇప్పటికి ట్రీట్​మెంట్​ కోసం రూ.40 లక్షలు ఖర్చు చేశాం. ఇన్నాళ్లూ కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డ ఆయనను బతికించుకునేందుకు తెలిసిన కాడల్లా అప్పులు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఆపద వచ్చినా ప్రభుత్వమే చూసుకుంటుందన్న  నమ్మకం గతంలో ఉండేది. కానీ ఇప్పుడా నమ్మకం పోయింది. అందరూ ఉన్నా అనాథలుగా మారిపోయాం. ముగ్గురు పిల్లలతో పాటు ప్రతి రోజు మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. ఆయనతో పాటు మేము కూడా జీవచ్ఛవాలుగా మారిపోయాం.
- శాంత, ఏఎస్ఐ సత్యనారాయణ భార్య