జీహెచ్ ఎంసీ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కష్టాలు

జీహెచ్ ఎంసీ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కష్టాలు
  • గతనెల ఫిబ్రవరి 14 తో ముగిసిన గడువు
  • ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీ లో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి  నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో సిక్ అయిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగురోజుల క్రితం  ఓ శానిటేషన్ జవాన్ కు హార్ట్ ఎటాక్ రావడంతో కుటుంబసభ్యులు  స్థానిక హాస్పిటల్ కి తరలించారు.

రూ.5 లక్షలు అవుతుందని హాస్పిటల్లో వైద్యులు చెప్పడంతో డబ్బులు కట్టలేక, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. 2019 నుంచి జీహెచ్ఎంసీ లో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్  ఉంది.  అంతకుముందు ఉద్యోగులు హాస్పిటల్లో జాయిన్ అయితే.. ఆ బిల్లులు తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకునేవారు.  అప్పట్లో బిల్లులు త్వరగా రాకపోవడంతో ఇబ్బందులు పడేవారు.  దీంతో  ఉద్యోగులకు అప్పటి కమిషనర్ లోకేశ్​ కుమార్  హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. మొదట  మూడు లక్షల వరకు కవర్ అయ్యేది.

ఆ తర్వాత రూ.5 లక్షల వరకు  పెంచారు.  అయితే ఇన్నిరోజులు పాటు ఉన్న బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదని ఉద్యోగులు ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేశారు.  పేరుకే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అసలు హాస్పిటల్స్ వీటిని యాక్సెప్ట్ చేయట్లేదని ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ను పదిలక్షలకు పెంచాలని కోరారు.

ఓ శానిటేషన్​ జవాన్ కి హార్ట్ ఎటాక్

నాలుగురోజుల క్రితం ఓ శానిటేషన్ జవాన్ కి హార్ట్ ఎటాక్ రావడంతో ఖైరతాబాద్ లోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నాలుగు స్టంట్స్ వేయాలని, ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వర్గాలు శానిటేషన్ జవాన్ ఫ్యామిలీకి తెలిపారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్ వారికి ఆ కార్డు ఇవ్వగా..  ఇది ఎక్స్ పైర్ అయిందని తెలిపారు.  మొత్తం డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు.

దీంతో ఏం చేయాలో తెలియక, ఈ విషయం పై వరుసగా కమీషనర్, అడ్మిన్ అడిషనల్ కమీషనర్ ని కలిసిన ప్రయోజనం దక్కలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్ పైర్ అయ్యే నెల ముందే ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. శానిటేషన్ జవాన్ హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఏ అధికారి పట్టించుకోవడం లేదంటున్నారు.

మూడు రోజులుగా కమీషనర్ కి లెటర్ రాసినా పట్టించుకోవడం లేదని, ఎలాగైనా హాస్పిటల్ తో మాట్లాడి జవాన్ ను బతికించుకోవాలని కోరుతున్నారు. పెద్ద పెద్ద ఏజెన్సీలకు ఇలాంటి పనులు చేయకపోయినా బిల్లులు వెంటనే రిలీజ్ చేస్తారు.. కానీ ఇలాంటి వాటిని మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.

టెండర్లకు పిలవలె

ఉద్యోగులు చెప్పిన ప్రకారం ఈసారి బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి పాలసీ తీసుకుందామని, దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు పిలుస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. ఇన్నిరోజులపాటు ఉన్న ఇన్సూరెన్స్ గతనెల ఫిబ్రవరి 14 తో ముగిసింది. బల్దియా నుంచి ప్రీమియం కట్టకపోవడంతో రెన్యువల్ కాలేదు. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్లను పిలుస్తామని చెబుతున్నారే తప్ప ఉన్నతాధికారులు దీనిని పట్టించుకోవడం లేదు. దీంతో గత కొన్నిరోజులుగా సిక్ అవుతున్న ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ లేకపోవడంతో హాస్పిటల్లో డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.