హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్వో(WHO) హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సోమవారం సెక్రటేరియెట్‌లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కేసులకు ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని చెప్పారు. మందులు, టెస్టింగ్ కిట్లను రెడీగా ఉంచుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల తీరు, పరిస్థితిని అంచనా వేస్తూ వైరస్ తీవ్రతను గుర్తించాలన్నారు. అక్కడి పేషెంట్ల రికవరీ విధానంపై డాక్టర్లతో అధికారులు చర్చించాలన్నారు.
అవసరమైతే విదేశాల్లోని నిపుణుల సలహాలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ పోర్టుల్లోనూ స్క్రీనింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంకీపాక్స్‌పై భయాందోళనలు అక్కర్లేదని ప్రజలకు మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ టెస్టు కిట్ లు, మందుల స్టాక్ పెడతామన్నారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డీహెచ్ రవీందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.