- అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర సూచన
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్‌లతో బాధపడుతున్న రోగుల వివరాలను అనుసంధానం చేయాలని అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ సూచించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లలో అందుతున్న వైద్యసేవలపై పేషెంట్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పేషెంట్ల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. పేషెంట్లు రెగ్యులర్‌గా మెడిసిన్ వినియోగించేలా చూడాలన్నారు.
బీపీ, షుగర్ వంటి రోగాల బారినపడ్డవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైఫ్ స్టైల్‌లో చేసుకోవాల్సిన మార్పులపై వివరించాలన్నారు. గురువారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ ఆఫీసులో మంత్రి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో చేసిన ఎన్‌సీడీ సర్వే వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.
గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పేషెంట్ల జాబితాను రూపొందించాలని మంత్రి సూచించారు. మొబైల్ ద్వారా పేషెంట్లకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, ఎన్‌సీడీ సర్వేను కొనసాగించాలని సూచించారు.