ఎంసీహెచ్‌‌ల తరహాలో ఎన్‌‌సీడీ క్లినిక్ లు : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ఎంసీహెచ్‌‌ల తరహాలో ఎన్‌‌సీడీ క్లినిక్ లు : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  • తొలుత టీచింగ్ హాస్పిటళ్లలో ఏర్పాటు:మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: మాతాశిశు ఆరోగ్య కేంద్రాల తరహాలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్  (ఎన్ సీడీ) క్లినిక్ లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. తొలుత టీచింగ్  హాస్పిటళ్లలో వాటిని ఏర్పాటు చేయాలని, తర్వాత ఏరియా ఆసుపత్రులకు విస్తరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎన్‌‌సీడీలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్  ఆఫీసులో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఎన్ సీడీల భారం ఏటికేడు పెరుగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. మొత్తం డిసీజ్  బర్డెన్‌‌లో 60 శాతం ఎన్‌‌సీడీతో లింక్ అయి ఉంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌‌సీడీ సమస్య తీవ్రత గురించి ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్ సీడీల వల్ల కలిగే ఆర్థిక భారం, జీవితకాలం తగ్గిపోవడం, కుటుంబాలపై పడే ప్రభావం వంటి అన్ని అంశాలను ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు. ఎన్‌‌సీడీ  పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ అందించేందుకు అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో స్పెషల్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఎక్కడైనా క్లినిక్స్ ఉంటే వాటిని ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్లకు సమగ్రంగా అన్ని రకాల వైద్యసేవలు అందించాలన్నారు.