ఎంసీహెచ్‌ల తరహాలో ఎన్‌సీడీ క్లినిక్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

ఎంసీహెచ్‌ల తరహాలో ఎన్‌సీడీ క్లినిక్స్: మంత్రి దామోదర రాజనర్సింహ
  • తొలుత టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు
  • ఇప్పటికే ఉన్న క్లినిక్స్ ఆధునీకరణ
  • ఆ తర్వాత జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు విస్తరణ
  • ఎన్‌సీడీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
  • అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర రాజ నర్సింహ
  • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో వివిధ అంశాలపై మంత్రి సమీక్ష

హైదరాబాద్: ఏటికేడు పెరుగుతున్న నాన్‌ కమ్యూనికెబుల్‌ డిసీజెస్‌(ఎన్‌సీడీ) నియంత్రణ, వాటి బారిన పడిన ప్రజలకు చికిత్స అందించడంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు ఎన్‌సీడీలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రాల తరహాలో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ బర్డెన్‌  ఏటికేడు పెరుగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. మొత్తం డిసీజ్ బర్డెన్‌లో 60 శాతం ఎన్‌సీడీతో లింక్ అయి ఉంటున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్‌సీడీ సమస్య తీవ్రత గురించి ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు, బీపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీ సమస్యల వంటి ఎన్‌సీడీల బారిన పడడం, ఆ రోగాల వల్ల కలిగే ఆర్థిక భారం, జీవితకాలం తగ్గిపోవడం, కుటుంబాలపై పడే ప్రభావం వంటి అన్ని అంశాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు.

ఎన్‌సీడీ పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో స్పెషల్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఎక్కడైనా క్లినిక్స్ ఉంటే వాటిని ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు.  మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ల తరహాలో ఎన్‌సీడీ క్లినిక్స్ ఉండాలన్నారు. అక్కడికి వచ్చిన పేషెంట్లకు సమగ్రంగా అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన డాక్టర్లను క్లినిక్స్‌లో నియమించాలని సూచించారు. ఆధునిక చికిత్స అందించడానికి అవసరమైన డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, మెడిసిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఎన్‌సీడీ క్లినిక్స్‌ను తొలుత టీచింగ్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌కు విస్తరించాలని మంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలపై మంత్రి ఆరా తీశారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.