సంగారెడ్డి జిల్లాలో మందుల కొరతపై మంత్రి ఆగ్రహం

 సంగారెడ్డి జిల్లాలో మందుల కొరతపై మంత్రి ఆగ్రహం
  • హాట్​హాట్​గా సంగారెడ్డి జడ్పీ సమావేశం

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో మందుల కొరతపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులపై సీరియస్ అయ్యారు. చైర్ పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన గురువారం జరిగిన జడ్పీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మందుల కొరతపై ప్రజాప్రతినిధులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో సమావేశం హాట్ హాట్​గా జరిగింది. ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రుల్లో కొరత తీవ్రంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి తెలిపారు. ఈ విషయమై డీఎంహెచ్​వో గాయత్రీ దేవిని మంత్రి ప్రశ్నించగా, పైనుంచే కొరత ఉండడంతో ఇబ్బందులు ఉన్నాయన్నారు.

ఆమె చెప్పిన సమాధానానికి మంత్రి తీవ్రంగా స్పందించారు. జిల్లాకు మందులు తెప్పించడంలో లోపం మీలో పెట్టుకొని ఉన్నతాధికారులను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని మందలించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని అవసరమైన మందులు ఎందుకు తెప్పించుకోలేకపోయారని నిలదీశారు. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులపై నెట్టేయడం అలవాటైందని మండిపడ్డారు.

ఇప్పటికైనా అవసరమైన మందులు తెప్పించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల అభివృద్ధిపై మంత్రి చర్చించారు. అధికారులు ఇకనుంచి జాగ్రత్తగా పని చేయాలని హెచ్చరించారు. ఇప్పటివరకు మీరు ఎలా పనిచేసిన చెల్లుబాటయ్యిందని..ఈ ప్రభుత్వంలో అలా కుదరదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం చేసిన ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. 

భగీరథ నీటి సరఫరాపై ఎంపీల అసంతృప్తి

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఎంపీలు రఘునందన్ రావు, సురేష్​ షెట్కార్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వానకాలంలో సైతం అక్కడక్కడ నీటి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను అధికారులకు చెప్పుకుందామంటే ఎవరూ అందుబాటులోకి రావడం లేదని జడ్పీటీసీలు రమేశ్, రాజు రాథోడ్ ఆరోపించారు.  దీంతో తాగునీటి సౌకర్యాన్ని పెంచాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

ALSO Read : గురువారం ఐలాపూర్​లో నిర్మాణాల నిలిపివేత
 
చివరి రోజు సన్మానాలు

సభ్యుల పదవీకాలం గురువారంతో ముగిసిన నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు. తొలుత జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, వైస్ చైర్మన్ ప్రభాకర్ ను మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ క్రాంతి వల్లూర్ సన్మానించారు. అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అధికారులు సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జీవనరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.