- బేసిక్ సమాచారంతో రూపొందించండి: మంత్రి దామోదర
- హెల్త్ ప్రొఫైల్ తయారీపై అధికారులు,ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: స్టేట్ హెల్త్ ప్రొఫైల్ తయారీ, హెల్త్ కార్డుల పంపిణీపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ చేశారు. సెక్రటేరియట్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, డీఎంఈ వాణి, వీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, వివిధ ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.
సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు హెల్త్ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం సాయపడాలన్నారు. ప్రజలను భయపెట్టేలా, వారికి ఇబ్బంది కలిగేలా సమాచార సేకరణ ఉండకూడదని, వారికి హెల్త్ ప్రొఫైల్ అవసరాన్ని వివరించి, వారి కన్సెంట్‌తోనే సమాచార సేకరణ జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న విధానాలను అధికారులు మంత్రికి వివరించారు.
హెల్త్ ప్రొఫైల్‌లో ప్రాథమిక సమాచారం మాత్రమే సేకరించాలని, ఒకేసారి ప్రజలందరికీ రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. గతంలో ములుగు, సిరిసిల్లలో చేసిన పైలట్ ప్రాజెక్ట్ విఫలమడానికి ఇదే కారణమని మంత్రికి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ప్రతిపాదనలను రెడీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రాసెస్ స్పీడప్ చేయాలి
తొలుత ప్రజల వద్ద పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఏదైనా ఐడీ కార్డు నంబర్, ఫోన్ నంబర్, వృత్తి వంటి సాధారణ వివరాలను సేకరించి వాటితో హెల్త్ కార్డులు తయారు చేయాలని మంత్రి దామోదర సూచించారు. యూనిక్ నంబర్, ఫొటో, బార్ కోడ్‌తో ఈ కార్డులు ఉండాలన్నారు. ఆ తర్వాత వ్యక్తి బరువు, ఎత్తు, వృత్తి, బ్లడ్ గ్రూప్, బీపీ, షుగర్, గతంలో చేయించుకున్న ఆపరేషన్లు, కంటి సమస్యలు, దంత సమస్యలు, ఈఎన్‌టీ సమస్యలు, గతం తాలుకు అనారోగ్య సమస్యలు, మద్యం, స్మోకింగ్, టొబాకో, తదితర అనారోగ్య కారక అలవాట్ల సమాచారాన్ని సేకరించి, ఆ వివరాలను హెల్త్ కార్డుల్లో నిక్షిప్తం చేయాలని సూచించారు.
వీలైనంత త్వరగా హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కమిషనర్ కర్ణన్‌కు సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, డాక్టర్లతో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. దవాఖాన్లలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా హెల్త్ ప్రొఫైల్ తయారీ కార్యాచరణ ఉండాలన్నారు.