కోర్టు తీర్పు రాగానే ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు కొత్త బిల్డింగ్ : దామోదర రాజనర్సింహా

కోర్టు తీర్పు రాగానే ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు కొత్త బిల్డింగ్ : దామోదర రాజనర్సింహా
  • ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తాం: దామోదర రాజనర్సింహా
  • ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో రాజీపడేది లేదు
  • జిల్లాల్లోనే అన్నిరకాల సౌలత్​లతో ట్రీట్​మెంట్
  • జూడాల సమస్యలు పరిష్కరించినం
  • రూ.610 కోట్లు మంజూరు చేశామని వైద్య శాఖ మంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌కు కొత్త బిల్డింగ్ కట్టి తీరుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని, తీర్పు రాగానే బిల్డింగ్‌‌‌‌ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. కొత్త బిల్డింగ్‌‌‌‌ కట్టే విషయంలో ప్రభుత్వం కమిట్మెంట్​తో ఉందని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లో గాంధీ, ఉస్మానియా, హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు. బంజారాహిల్స్‌‌‌‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌లో బుధవారం జూనియర్ డాక్టర్లతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో మాట్లాడారు.

‘‘పదేండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సమస్యలను ఈ నెల 15న జూడాలు నా దృష్టికి తీసుకొచ్చారు. పది రోజుల్లోనే సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాం. జూడాలకు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా స్టైఫండ్స్‌‌‌‌ ఇవ్వడానికి ఒకేసారి రూ.406 కోట్లకు బీఆర్వోలు ఇచ్చాం. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో హాస్టల్ బిల్డింగులు, ఇంటర్నల్ రోడ్స్, ఇతర వసతుల కోసం రూ.204 కోట్లు కేటాయించాం. ఇందులో ఉస్మానియాకు రూ.121 కోట్లు, గాంధీకి రూ.80 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి రూ.3.45 కోట్లు కేటాయించాం’’అని తెలిపారు. 

విద్య, వైద్యం విషయంలో రాజకీయాలు వద్దు

ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ కట్టాలని జూడాలు డిమాండ్ చేశారని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. అయితే, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని మంత్రి వివరించారు. మిగిలిన అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా పది రోజుల్లోనే సుమారు రూ.610 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. విద్య, వైద్యం ప్రజలకు సంబంధించిన అంశాలన్నారు. వీటి విషయాల్లో రాజకీయాలు చేయొద్దన్నారు.

మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతాం

ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా.. జిల్లాల్లోనే అన్నిరకాల సౌకర్యాలతో ప్రజలకు వైద్యం అందేలా ప్రభుత్వ దవాఖాన్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఉన్నట్టుగానే, ప్రైవేటు హాస్పిటళ్ల మ్యాటర్​లోనూ నిబంధనలను స్ట్రిక్ట్‌‌‌‌గా అమలు చేస్తామన్నారు. కామన్ మ్యాన్‌‌‌‌ను ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్ యాక్ట్ స్ట్రిక్ట్‌‌‌‌గా ఇంప్లిమెంట్ చేస్తూ హాస్పిటళ్లను కంట్రోల్ చేస్తామని తెలిపారు. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నామన్నారు. 

సమ్మె విరమిస్తున్నం: జూడా

ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చినందుకు తక్షణమే సమ్మె విరమిస్తున్నామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌ (జూడా) ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ హర్ష ప్రకటించారు. పదేండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న సమస్యలను.. పది రోజుల్లోనే పరిష్కరించిన సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పదేండ్లుగా స్టైఫండ్ సకాలంలో రావడం లేదు.

ఇప్పుడు తొలిసారి ఇంటర్న్స్‌‌‌‌, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్‌‌‌‌ అందరికీ కలిపి ఏడాది వరకు ప్రతి నెలా స్టైఫండ్స్ ఇచ్చేలా రూ.406 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. రెండు రోజుల్లోనే ఉస్మానియా, గాంధీలో హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇంటర్నల్ రోడ్ల కోసం రూ.204 కోట్లు కేటాయించారు”అని హర్ష వివరించారు.