ప్రజల చెంతకే ప్రభుత్వం .. ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన : దామోదర​ రాజనర్సింహా

ప్రజల చెంతకే ప్రభుత్వం .. ఆరు గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన : దామోదర​ రాజనర్సింహా
  • వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర​ రాజనర్సింహా

టేక్మాల్, రేగోడ్, వెలుగు: ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి, ప్రజలతో మమేకమై పని చేయాలనే ఆలోచనతోనే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. గురువారం మెదక్​ జిల్లా టేక్మాల్​ మండలం చల్లపల్లి, అల్లాదుర్గం మండలం రాంపూర్, రేగోడ్ మండలం లింగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభలలో పాల్గొని మహిళలకు దరఖాస్తు ఫారాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. ఆనాడు ఇందిరమ్మ తరహాలోనే ఇపుడు కాంగ్రెస్ పాలన కొనసాగుతోందన్నారు. 

ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజాపాలనలో  దరఖాస్తులు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. 9 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం, ఇండ్ల స్థలాల కోసం ఎంతో మంది ఎదురు చూశారని, ఇక ఈ సమస్యకు  తెరపడనుందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల విషయంలో తగిన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మెదక్ జిల్లాలో ఉన్న టేక్మాల్​  మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఆర్డీఓ రాజేశ్వర్​, జడ్పీటీసీ సభ్యురాలు సరోజ, స్పెషల్​ ఆఫీసర్​ సాయిబాబా, అల్లాదుర్గం జడ్పీటీసీ సౌందర్య పాల్గొన్నారు. 

జోగిపేట, పుల్కల్:  ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. గురువారం ఆందోల్​ మండల పరిధిలోని అల్మాయిపేట, సంగుపేట, చౌటకూర్​ మండల పరిధిలోని శివ్వంపేట గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్​ చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత  నెలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ. 10 లక్షలకు పెంచుతూ మార్పు చేసి  పథకాలను అమలు చేసినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో కలెక్టర్​ శరత్​కుమార్​, ఆర్డీఓ పాండు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

నేను సూదుల మంత్రిని అయ్యా

రాయికోడ్: 'ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీరంతా ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిండ్రు,  మీ ఆశీస్సులతో  ఇప్పుడు నేను సూదుల మంత్రి అయ్యాను  ఈ విషయం మీ అందరికి తెలుసా' అని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర​ రాజనర్సింహా అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండలంలోని సింగితం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట్​రెడ్డి, జడ్పీ సీఈఓ సీహెచ్​ఎల్లయ్య,  జడ్పీటీసీల ఫోరం జిల్లా  అధ్యక్షుడు మల్లికార్జున్​పాటిల్​,  ఎంపీపీ మమత, మాజీ జడ్పీటీసీ అంజయ్య, కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ నర్సింలు,  యూత్​ కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ప్రభాకర్​ అధికారులు పాల్గొన్నారు.