ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి
  • ఆఫీసర్లకు మంత్రి హరీశ్‌‌ ఆదేశం
  • తానూ ఒక రోజు దవాఖాన్లనే ఉంటానని ప్రకటన

హైదరాబాద్, వెలుగు : పల్లె నిద్ర తరహాలో ప్రతి నెలా ఒక రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌లో నిద్రించాలని డీఎంహెచ్‌‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌‌వోలను మంత్రి హరీశ్‌‌రావు ఆదేశించారు. రోజంతా హాస్పిటల్‌‌లోనే ఉండి పేషెంట్లు, స్టాఫ్ సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పీహెచ్‌‌సీని కనీసం నెలకోసారి విజిట్ చేయాలని సూచించారు. తాను కూడా నెలకోరోజు హాస్పిటల్‌‌లోనే నిద్రిస్తానని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలు, డిప్యుటీ డీఎంహెచ్‌‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌‌సీలలో ఎమర్జన్సీ సేవలు 
అందించాలన్నారు. 

సిజేరియన్లపై సీరియస్​
సిజేరియన్ డెలివరీలు తగ్గించాలని చెప్పినా కొన్ని ప్రైవేట్​ హాస్పిటళ్ల తీరు మారడం లేదని, అలాంటి వాటిపై మెడికల్ కౌన్సిల్‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్రంలో 210 సబ్ సెంటర్ల పరిధిలో 70 శాతం కంటే ఎక్కువ ప్రసవాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో జరుగుతున్నట్టు గుర్తించామని, దీంతో సిజేరియన్ల సంఖ్య పెరుగుతోందన్నారు. దీన్ని సీరియస్​గా తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. వచ్చే నెల వరకు వేచి చూస్తామని, తీరు మారకుంటే చర్యలు తప్పవన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను గుర్తించి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటు 23 నుంచి 21 తగ్గిందని శాంపిల్‌‌ రిజిస్ట్రేషన్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని రివ్యూలో మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వం చేపడుతున్న కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి తదితర కార్యక్రమాలు, డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. దీన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. నార్మల్ డెలివరీలు చేసే డాక్టర్లు, సిబ్బందికి ఇన్సెంటీవ్స్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.