- కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ఆయా రాష్ట్రాలకు హెల్త్ మినిస్ట్రీ లెటర్
- వీక్లీ పాజిటివిటీ రేటు పెరగడంపై ఆందోళన
న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, ఆస్పత్రుల్లో సౌలతులు కల్పించాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ఆ రాష్ట్రాలకు లెటర్ రాశారు. ఈ లిస్టులో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ ఎక్కువగా ఉన్న జిల్లాలను లెటర్ లో పేర్కొన్న కేంద్రం.. ఆయా జిల్లాల్లో వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అరుణాచల్ ప్రదేశ్ లో వీక్లీ పాజిటివిటీ రేటు 16.2 శాతంగా ఉందని, నెల రోజుల్లోనే కేసుల సంఖ్య 12 శాతం పెరిగిందని రాజేశ్ భూషణ్ చెప్పారు. 9 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉందని పేర్కొన్నారు. అస్సాంలో 4 జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, కొన్ని జిల్లాల్లో డెత్స్ ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మణిపూర్ లోని రెండు జిల్లాల్లో కేసులు, డెత్స్ పెరిగాయన్నారు. కేరళలోని చాలా జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని, మేఘాలయలో 14.05 శాతానికి పెరిగిందని చెప్పారు. నాగాలాండ్, ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని పేర్కొన్నారు.
కొత్త కేసులు 43 వేలు.. డెత్స్ 930
దేశంలో కొత్తగా 43,733 కేసులు నమోదయ్యాయని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.06 కోట్లకు చేరిందని చెప్పింది. వైరస్‌తో మరో 930 మంది చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 4.04 లక్షలకు చేరిందని వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4.59 లక్షలకు తగ్గిందని పేర్కొంది. రికవరీ రేటు 97.18 శాతానికి పెరగ్గా.. డైలీ పాజిటివిటీ రేటు 2.29 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39 శాతానికి తగ్గింది. డెత్ రేటు 1.32 శాతంగా నమోదైంది. కొత్త కేసుల కంటే రికవరీలు పెరిగాయని, ఇప్పటివరకు 2.97 కోట్ల మంది కోలుకున్నారని హెల్త్ మినిస్ట్రీ చెప్పింది. ఇప్పటి వరకు 36.13 కోట్ల డోసుల టీకాలు వేశామని పేర్కొంది.
వీక్లీ డెత్ రేటు తగ్గింది: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచవ్యాప్తంగా వీక్లీ డెత్ రేటు తగ్గిందని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది. జూన్ 28 నుంచి జులై 4 మధ్య మరణాలు 7% తగ్గాయని చెప్పింది. మొత్తం 54 వేల మంది చనిపోగా, గత అక్టోబర్ నుంచి ఇదే తక్కువని పేర్కొంది. కాగా, ఇదే పీరియడ్‌లో కేసులు కొద్దిగా పెరిగి.. 26 లక్షలు నమోదయ్యాయంది. యూరోపియన్ రీజియన్‌లో 30% కేసులు పెరగ్గా, ఆఫ్రికాలో 23% డెత్స్ పెరిగాయని వివరించింది. బ్రెజిల్, ఇండియాలో కేసులు తగ్గగా.. కొలంబియా, ఇండోనేషియా, బ్రిటన్ లో పెరిగాయంది.