మళ్లా తనిఖీల హడావుడి

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ప్రైవేట్​ హాస్పిటళ్లలో తనిఖీల పేరుతో హెల్త్​ ఆఫీసర్లు మరోసారి హడావుడి చేస్తున్నారు. 4 నెలల కింద రాష్ట్ర వ్యాప్తం గా వైద్యారోగ్య శాఖ తనిఖీలు చేసి రూల్స్​పాటించని హాస్పిటల్స్, డయాగ్నస్టిక్​ ​సెంటర్లకు నోటీసు లు జారీ చేసింది.  అనంతరం తనిఖీలు ఆపేసింది. ఆ నోటీసులపై ఏ ఒక్క హాస్పిటల్‌‌‌‌‌‌‌‌పై చర్య తీసుకోలేదు.  మామూళ్లు తీసుకొని ఆఫీసర్లు సైలంట్​అయ్యారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ వారం నుంచి జిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి.  
ఇష్టారాజ్యంగా ఆసుపత్రుల నిర్వహణ 

జిల్లాలో  ప్రైవేట్​ వైద్యం ఖరీదుగా మారింది. చిన్న చిన్న ఆపరేషన్లకు, టెస్ట్‌‌‌‌‌‌‌‌లకు రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. హాస్పిటళ్లలో దోపిడీని అరికట్టడానికి  మూడు నెలలకోసారి తనిఖీ చేయాల్సి ఉన్నా జిల్లా వైద్యారోగ్య ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి.  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి ఆదేశాలు వస్తే తప్ప జిల్లా ఆఫీసర్లు తనిఖీలకు వెళ్లడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే డాక్టర్లలో సగం మందికి జిల్లాలోని ప్రధాన టౌన్‌‌‌‌‌‌‌‌లలో ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో జిల్లా వైద్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.  తనిఖీలు లేని కారణంగా ప్రైవేటు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఇష్టారీతిన రోగులను దోచుకుంటున్నాయి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 142 హాస్పిటల్స్, 22 ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. నాలుగు నెలల కింద సర్కార్​ ఆదేశాలతో 38 హాస్పిటల్స్, 22 ల్యాబ్‌‌‌‌‌‌‌‌ల్లో తనిఖీలు నిర్వహించి 10 హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌, 2 ల్యాబ్​లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్కదానిపై కూడా చర్యలు తీసుకోలేదు. టెస్ట్‌‌‌‌‌‌‌‌ల పేరిట ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, డయాగ్నస్టిక్​సెంటర్లలో ఇష్టానుసారంగా దోపిడీ చేసిన పట్టించుకునేవారే లేరు. ట్రైనింగ్ లేని నర్సులు, తక్కువ శాలరీకి పనిచేసే డాక్టర్లతో  కొన్ని హాస్పిటళ్లు నడుస్తున్నాయి. 

తనిఖీలకు ఫైవ్​మెన్​కమిటీ ఏర్పాటు 

హాస్పిటల్ తనిఖీలకు ఐదుగురు సభ్యులతో కమి టీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అసిస్టెంట్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో శ్రీరాములు, తహసీల్దార్​విజయ్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, టాస్క్​ఫోర్స్ మెంబర్ భాస్కర్, ఐఎంఏ మెంబర్  సంతోష్​ కుమార్ ఉన్నారు. కలెక్టర్​ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది హాస్పిటళ్లపై తనిఖీలు నిర్వహించారు. మూడు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేశారు.  త్వరలో  జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేసి రూల్స్‌‌‌‌‌‌‌‌కు విరుద్ధంగా నడిచే హాస్పిటళ్లపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. 

తనిఖీలు నామమాత్రం.. 

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ చేసిన తనిఖీల్లో పారదర్శకత లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్​యాక్ట్   ప్రకారం హాస్పిటల్, డయాగ్నోస్టిక్​​ఏర్పాటు చేయాలంటే జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి పర్మిషన్​తీసుకొని అన్ని సౌకర్యాలు, క్వాలిఫైడ్​ డాక్టర్లు, ట్రైన్డ్​ స్టాఫ్, బయో మెడికల్​వేస్ట్​ మేనేజ్​మెంట్​ మెయింటెయిన్​ చేయాలి. కానీ జిల్లాలో చాలా హాస్పిటళ్లలో ఇవేమి కనిపించడం లేదు. మంచి పేరున్న డాక్టర్లను విజిటింగ్ డాక్టర్లుగా ప్రకటించుకుంటూ అర్హత లేని వారితో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్​చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూల్స్ పాటించని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకుంటాం 

రూల్స్ కు వ్యతిరేకంగా నడిపే ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఇచ్చాం. గత అక్టోబర్ లో తనిఖీలు చేపట్టాం. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి తనిఖీలు ఆపేశాం. వారం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ తనిఖీలు ప్రారంభించాం. రూల్స్ కు విరుద్ధంగా నడిచే హాస్పిటల్స్​పై చర్యలు తీసుకుంటాం. 
- డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సుమన్ మోహన్ రావు