ఆధునిక మానవుల జీవన విధానం, ఆలోచనలు, ఆహారపు అలవాట్లు ఎంతగానో మారుతున్నాయి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, కోలా లాంటి కార్బొనేటెడ్ షుగర్- స్వీటెన్డ్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం నిత్యకృత్యం అవుతున్నది. 2020 అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా షుగర్- స్వీటెన్డ్ బ్రెవరేజెస్ సేవించడంతో సాలీనా కొత్తగా 2.2 మిలియన్ల టైప్-2 షుగర్ కేసులు, 1.2 మిలియన్ల కార్డియో వ్యాసిక్యులార్ లేదా హృదయనాళ సంబంధ వ్యాధుల కేసులు బయటపడినట్లు తేల్చారు.
ప్రపంచవ్యాప్తంగా 184 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో లాటిన్ అమెరికా, కరేబియన్, సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో అతిగా కూల్డ్రింక్స్ సేవించడం వల్లనే 11– -24 శాతం వరకు అధికంగా మధుమేహ, గుండె జబ్బులు పెరిగినట్లు గమనించారు. కేవలం కొలంబియాలో 48 శాతం, మెక్సికోలో 33 శాతం అధికంగా మధుమేహ, కార్డియో వ్యాసిక్యులార్ కేసులు తీపి శీతల పానీయాలు అపరిమితంగా తాగడం వల్ల నమోదు అవుతున్నట్లు తేలింది. దక్షిణ ఆఫ్రికాలో 15 –28 శాతం వరకు కేసులు పెరగడం గమనించారు.
అతిగా సేవించడం వల్ల టైప్-2 డయాబెటిస్/గుండెజబ్బులతో పాటు అధిక బరువు లేదా స్థూలకాయం, పంటి జబ్బులు, కిడ్నీ సమస్యలు, లివర్ జబ్బులు, గౌట్ వ్యాధి, ఎముకల సాంద్రత తగ్గడం, బిపీ పెరగడం, స్ట్రోక్ రావడం, కిడ్నీలో రాళ్లు పడడం లాంటి పలు సమస్యలు వస్తాయి. వీటిని తాగడం వల్ల వెంటనే రక్తంలో షుగర్ స్థాయి పెరగడంతో బరువు పెరగడం, జీర్ణ వ్యవస్థ సంబంధ సమస్యలు అతిగా నమోదు అవుతున్నాయి. మహిళల కన్నా పురుషుల్లో ఈ అనారోగ్య సమస్యలు అధికంగా బయట పడడం గమనించారు.
కూల్‌డ్రింక్స్‌ను అత్యధికంగా సేవిస్తున్న మెక్సికన్లలో ఈ సమస్య ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించటానికి చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి ప్రచారమే రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో జరపవలసిన దుస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే అని గమనించాలి. పోషకాహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవడంతోపాటు శారీరక వ్యాయామం, తగిన నిద్ర, నిశ్చలంగా గంటల తరబడి కూర్చొని పని చేయకుండా గంటగంటకు కొద్ది సేపు లేచి నడవడం లాంటి అలవాట్లను చేసుకోవాలి. జంక్/ప్రాసెస్డ్/బ్రెవరేజ్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి