అనుమానమే పెనుభూతం.. 

అనుమానమే పెనుభూతం.. 

ఆరోగ్యం అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సులతో కూడిన పరిపూర్ణత. శారీరకంగా బాగుంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ బాగుండాలి. మారుతున్న కాలాన్ని బట్టి ఉరుకుల, పరుగుల జీవితం.. విద్య, ఉద్యోగం, కుటుంబం.. ఇలా అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. స్కిజోఫ్రెనియా అనేది కూడా తీవ్రమైన ఓ మానసిక రుగ్మత. దీని బారిన పడిన వారు వాస్తవికతను అసాధారణంగా, తప్పుగా అర్థం చేసుకుంటారు. అనుమానాలు ఎక్కువ, బ్రాంతులు, భ్రమలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు, ప్రవర్తనలు వారిలో కనిపిస్తాయి. మానసిక అనారోగ్యం గురించి ముఖ్యంగా స్కిజోఫ్రెనియా అనే అనుమానం జబ్బు గురించి అవగాహన కల్పించడానికి, మానసిక వ్యాధుల చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు నిర్మించే ప్రయత్నంలో భాగంగానే మే 24 ను ప్రపంచ స్కిజోఫ్రేనియా దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. స్కిజోఫ్రెనియా అనే పదానికి ‘మనస్సు విభజన’ అని అర్థం. 1910లో స్విస్ డాక్టర్ పాల్ యూజెన్ బ్ల్యూలర్ దీనికి పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా1 నుంచి 2 శాతం మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. 
 

స్కిజోఫ్రెనియాకు కారణాలు
స్కిజోఫ్రెనియాకు ప్రత్యేకమైన కారణమేమిటో తెలియదు. కానీ జన్యుశాస్త్రం, మెదడులోని రసాయన పదార్థాల అసమతుల్యత, సామాజిక పర్యావరణం మార్పుల కలయిక వాళ్ల ఈ రుగ్మత ఏర్పడుతుందని పరిశోధకులు, డాక్టర్లు విశ్వసిస్తున్నారు. డోపమైన్, గ్లుటామేట్ అని పిలిచే న్యూరోట్రాన్సిస్టర్లతో సహా కొన్ని సహజంగా సంభవించే మెదడు రసాయనాలతో సమస్యలు స్కిజోఫ్రెనియాకు దారితీస్తాయి. దీనివల్ల ఆలోచన, ప్రవర్తన, భావోద్వేగాల పరమైన సమస్యలు వస్తాయి. ఈ రుగ్మతతో బాధపడేవారు వాస్తవంలో లేని తప్పుడు, అపోహలు,అప నమ్మకాలతో ఉంటారు. కొన్ని సందర్భాల్లో తనకు అసాధారణమైన సామర్థ్యం లేదా కీర్తి ఉందని, లేదా విపత్తు జరగబోతుందని ఆధారం లేకుండా భ్రమపడుతుంటారు. వీళ్లకు ఆధారాలు చుపించినప్పటికీ వాటిని నమ్మరు. అలాగే మనస్సు లోపల లేదా వెలుపల నుంచి శబ్దాలు వస్తున్నట్లు బ్రాంతి చెందడం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, ప్రతికూల లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్సలు.. నివారణ
స్కిజోఫ్రెనియాకు జీవితకాల చికిత్స అవసరం. లక్షణాలు తగ్గినప్పటికీ మందులు, మానసిక, సామాజిక చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్స బృందంలో మనస్తత్వవేత్త, సామాజిక కార్యకర్త, మనోరోగచికిత్స నర్సు ఉంటారు. స్కిజోఫ్రెనియాకు యాంటిసైకోటిక్​మందులను సాధారణంగా సూచిస్తారు. వీటితోపాటు కొన్ని సందర్భాల్లో యాంటి యాంగ్జైటీ డ్రగ్స్ వంటివి ఇస్తారు. వీటితోపాటు బాధితులకు మానసిక, సామాజిక చేయూత అవసరం. వ్యక్తిగత చికిత్సలో భాగంగా సైకోథెరపీ ఆలోచనా విధానాలు ఉంటాయి. సామాజిక నైపుణ్యాల శిక్షణలో కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యలను మెరుగుపరుస్తారు. స్కిజోఫ్రెనియా జీవితంలోని ప్రతి  అంశాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. స్కిజోఫ్రెనియాపై  అవగాహన కలిగి ఉండటం, ముందుగానే రోగ నిర్ధారణ వల్ల దీని నివారణకు కృషి చేయవచ్చు.