- ఈ ఏడాది నెలకు సగటున రూ.38,250 కోట్లు
- వచ్చే ఏడాది ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా
- స్టాక్ మార్కెట్‌లోకి మాత్రం పెద్దగా రాని ఇన్వెస్ట్‌మెంట్స్
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా ఎన్ని సమస్యలున్నా ఇండియా మాత్రం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. నెలకు సగటున 4.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.38,250 కోట్ల)ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐలు) దేశంలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం ఇన్వెస్టర్లను ఆకర్షించేలా పాలసీలను తీసుకొస్తోంది. అంతేకాకుండా స్కిల్స్ ఉన్న వర్కర్లు అందుబాటులో ఉండడం, రూల్స్ భారాన్ని తగ్గించడం, కంపెనీలను చిన్న చిన్న కేసులను నుంచి శిక్ష మినహాయించడంతో ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం వేగంగా అనుమతులిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ సక్సెస్ కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య ఇండియాలోకి 42.13 బిలియన్ డాలర్ల (రూ.3.58 లక్షల కోట్ల) పెట్టుబడులు వచ్చాయి.
అంతకుముందు ఏడాది ఇదే టైమ్‌లో వచ్చిన 29.73 బిలియన్ డాలర్లతో పోలిస్తే 42 శాతం పెరిగాయి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–సెప్టెంబర్ నెలలను పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలోకి 29.79 బిలియన్ డాలర్లు వచ్చాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో వచ్చిన 20.48 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. కిందటి ఆర్థిక సంవత్సరం మొత్తంలో 71.28 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇండియా ఆకర్షించగలిగింది.
దీనిని బట్టి వచ్చే ఏడాది కూడా ఎఫ్‌డీఐల ఇన్‌ఫ్లోస్ కొనసాగుతాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సెక్రెటరీ అమర్దీప్ సింగ్ భాటియా అంచనా వేస్తున్నారు. ఎఫ్‌డీఏ లిమిట్స్‌ను సవరిస్తే ఇండియా ఎకానమీ గ్లోబల్ ఇన్వెస్టర్లను మరింతగా ఆకర్షిస్తుందని అన్నారు. రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించాలని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయాలని, బిజినెస్ వాతావరణాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు.
గత పదేళ్లలో రూ.84.24 లక్షల కోట్లు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 991 బిలియన్ డాలర్ల (రూ.84.24 లక్షల కోట్ల) విదేశీ పెట్టుబడులను ఇండియా ఆకర్షించింది. అంతకు ముందు పదేళ్లు అంటే 2004 నుంచి 2014 మధ్య 667 బిలియన్ డాలర్లు (రూ.56.70 లక్షల కోట్లు) వచ్చాయి. దీంతో పోలిస్తే 67 శాతం గ్రోత్ నమోదయ్యింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లోకి వచ్చిన పెట్టుబడులు గత పదేళ్లలో 165 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు పదేళ్లలో వచ్చిన 98 బిలియన్ డాలర్లతో పోలిస్తే 69 శాతం పెరిగాయి. గ్లోబల్‌గా సమస్యలున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఇండియా ఆకర్షించగలిగిందని నిపుణులు చెబుతున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపరచాలని, ఫార్మా, ప్రైవేట్ సెక్యూరిటీ ఎజెన్సీలు, బ్రాడ్‌కాస్టింగ్, ప్లాంటేషన్ వంటి కొన్ని సెక్టార్లలోకి వచ్చే ఎఫ్‌డీఐల లిమిట్‌ను సవరించాలని వివరించారు. సరిహద్దు దేశాల కంపెనీలు ఇండియాలోని ఏ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన దేశాలకు ఈ అడ్డంకులు లేవు.
డీపీఐఐటీ డేటా ప్రకారం 2000 వ సంవత్సరం తర్వాత ఇండియాలోకి ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో కంపెనీ ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు, లాభాలను తిరిగి ఇన్వెస్ట్ చేసినవి, ఇతర క్యాపిటల్ కలిసి ఉన్నాయి. 25 శాతం మారిషస్ నుంచి రాగా, 24 శాతం సింగపూర్ నుంచి, 10 శాతం యూఎస్ నుంచి, 7 శాతం నెదర్లాండ్స్ నుంచి, 6 శాతం జపాన్ నుంచి, 5 శాతం యూకే నుంచి, 3 శాతం యూఏఈ నుంచి వచ్చాయి. కేమాన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ దేశాల నుంచి 2 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి.
తగ్గిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు..
కిందటేడాది ఇండియా స్టాక్ మార్కెట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది మాత్రం పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఏడాది నికరంగా రూ.5 వేల కోట్లే ఇన్వెస్ట్ చేశారు. కొత్త ఏడాదిలో విదేశీ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌లో పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది మార్కెట్‌కు ఎఫ్‌పీఐలు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది షేర్ మార్కెట్‌లో నికరంగా రూ.5,052 కోట్లు, డెట్ మార్కెట్‌లో రూ.1.12 లక్షల కోట్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. కిందటేడాది షేర్ మార్కెట్‌లో నికరంగా రూ.1.71 లక్షల కోట్లను పెట్టారు. అదే 2022 లో మాత్రం ఇండియా మార్కెట్ నుంచి నికరంగా రూ.1.21 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.