శృతి మించితే శరీరానికి నష్టమేనంటున్న నిపుణులు
కరోనా నేపధ్యంలో ఆరోగ్యంపై దాదాపు అందరికీ అవగాహన వచ్చింది. రోగాలకు డబ్బులు పెట్టే బదులు మంచి తిండికి పెడదామనే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఈ మధ్య మంచి పోషక విలవలున్న ఆహార పదార్థాలు తినడం ఎక్కువైంది. తినేముందు ఇది ఆరోగ్యానికి మేలు అని చర్చించుకుంటూ తినడం అలవాటుగా మారిపోయింది. అయితే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని అదే పనిగా ఎక్కువ ప్రొటీన్లు ఉన్న పదార్థాలను తింటే శరీరానికి నష్టం జరుగుతుందంటున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల్లో పోషక విలువలు… అదేనండి ప్రొటీన్లు బ్యాలెన్స్ గా ఉండేటట్లు చూసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.
డాక్టర్లు, నిపుణుల పరిశోధనల్లో తాజాగా ఏమితేలిందంటే..
తిండి తినడం ఒక్కటే కాదు.. దానికి తగినట్లు శారీరక వ్యాయామం కూడా అవసరమని వారు చెబుతున్నారు.
ఇంట్లో బండెడు చాకిరీ చేస్తున్నామని మహిళలు సమర్ధించుకోవద్దంటున్నారు.
ఇంట్లో.. వంటింట్లో.. పెరట్లో ఎన్ని పనులు చేసినా.. కనీసం 50 నిమిషాల నుండి వీలైనంత ఎక్కువ సమయం తీరిగ్గా వాకింగ్ చేయడం చాలా అవసరం అని వారు సూచిస్తున్నారు.
డాక్టర్లు చెప్పారని వెంటనే మొదటి రోజే 50 నిమిషాలు వాకింగ్ చేసి.. రెండో రోజే ఒళ్ల నొప్పులతో మానేయడం కంటే.. నిదానంగా పెంచుకుంటూ పోవాలి.
తొలి రోజు 10 నిమిషాలు.. రెండో రోజు 15 నిమిషాలు.. మూడో రోజు 20 నిమిషాలు చొప్పున (అలసిపోతున్నామా..? శక్తి సరిపోయిందా అనేది చెక్ చేసుకుంటూ) వాకింగ్ చేయాలంటున్నారు.
వీలైతే ఉత్త కాళ్లతో నడిస్తే మంచిది. ఇంట్లోకి వెళ్లే ముందే కాళ్లు కడుక్కుని వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంట్లోకి రకరకాల వైరస్ లను, బ్యాక్టీరియాను ఆహ్వానించి అనారోగ్యాలకు దారిచూపినట్లు అవుతుంది.
ఉదయం పూట: మొలకెత్తిన గింజలు.. వాటి పేరెత్తితే గ్యాస్ ట్రబుల్ అనే వారు.. మొలకెత్తిన గింజలను ఉడికించి తినడమో లేదా సూప్ తాగడమో చేస్తే గ్యాస్ ట్రబుల్ రాదు. టిఫిన్ చేసిన వెంటనే టీ తాగడం లేదా.. పండ్లు తినడం కూడా చేయకూడదు. కనీసం గంటన్నర గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్రీన్ టీ.. లాంటివి తీసుకుంటే మంచిది. లేదా సీజన్లలో తక్కువ ధరకు దొరికే పండ్లు తీసుకోవాలి.
మధ్యాహ్నం పూట: ఆకలేస్తుందని కడుపు నిండా తినకూడదు. కనీసం పొట్టలో కాస్త ఖాళీ ఉండేటట్లుగా మితంగా తినాలి. తిన్న వెంటన కూర్చుని.. టీవీ చూస్తూ.. చదువుకుంటూ గాని.. ఫోన్లు చూస్తు గడపడమో చేయకుండా.. కనీసం 5 నుండి 10 నిమిషాలైనా నడవాలి.
భోజనం చేసిన రెండు గంటల తర్వాత : పండ్లు తింటే మంచిది. అయితే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న పండ్లు తీసుకుంటే మంచిది.
సాయంత్రం పూట : వీలైతే వేడి వేడిగా మొలకెత్తిన గింజలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే డైజేషన్ ప్రాబ్లెం ఉండదు.
చివరగా రాత్రి డిన్నర్: చీకటిపడిన వెంటనే వీలైనంత తొందరగా భోజనం పూర్తి చేయడం చాలా అవసరం. మన పూర్వీకులంతా చీకటిపడకముందే తిని.. కోడి కూసిన వెంటనే లేచి దైనందిన కార్యక్రమాలు చేయడం పెద్దలకు గుర్తే. రాత్రిపూట జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి వీలైనంత తొందరగా.. రాత్రి 8 లేదా 9 గంటల్లోపు డిన్నర్ పూర్తి కావాలి. మసాలాలున్న బిర్యానీల వంటి పదార్ధాలు కాకుండా.. సులభంగా డైజెస్ట్ అయ్యే తేలికపాటి పదార్థాలు తినాలి. లేకపోతే రాత్రిపూట తిన్న ఆహారం మొత్తం బాడీలో డిపాజిట్ అయిపోతుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగి ఒబేసిటీకి దారితీస్తుంది.
ఇవీ కూడా చదవండి..