- ధాన్యం ఆరబెట్టిన రైతుపై కేసు
మెట్ పల్లి, వెలుగు : రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. ధాన్యం కుప్పలపై బైక్ అదుపు తప్పడంతో యువకుడు కిందపడి చనిపోయాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఈ ఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం ఎస్సై ఉమాసాగర్ వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్ నగర్ తాలూకా మంగురు గ్రామానికి చెందిన భవూనె శివాజీ సంజయ్ (27) కొన్నేండ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి కుటుంబ సభ్యులతో వలస వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి పని మీద బర్దీపూర్ గ్రామానికి బైక్ పై వెళ్లి తిరిగి వేములకుర్తి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కుప్పలపైకి బైక్ దూసుకెళ్లి అదుపు తప్పింది.
దీంతో సంజయ్ కింద పడి తీవ్ర గాయాలతోఅక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి సంజయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, బాస చిన్న మల్లయ్య అనే రైతు మెయిన్ రోడ్డుపై నిర్లక్ష్యంగా వడ్ల కుప్పలు ఆరబెట్టాడు. రాత్రి టైం కావడంతో వాటిపై నల్ల కవర్ కప్పి ఉంచాడు. రోడ్డుపై నిర్లక్ష్యంగా ధాన్యం కుప్పలు ఆరబెట్టి తన భర్త మరణానికి కారణమైన చిన్న మల్లయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని సంజయ్ భార్య సోనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.