బాధితుల వివరణ విన్నాకే చర్యలు చేపట్టండి.. హైడ్రాకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో నిర్మాణాలున్నాయంటూ ఇచ్చిన నోటీసులపై బాధితుల నుంచి వివరణ తీసుకోవాలని..ఆ తర్వాతే చర్యలు చేపట్టాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. వివరణకు అవకాశం కూడా ఇవ్వకుండా హడావుడిగా చర్యలు చేపట్టడం కరెక్ట్ కాదని తెలిపింది. బాధితుల వివరణను తీసుకుని దాన్ని 4 వారాల్లో పరిష్కరించిన తరువాత చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైడ్రాకు స్పష్టం చేసింది. 

రంగారెడ్డి జిల్లా అల్మాస్‌‌గూడలోని నిర్మాణాలను తొలగించాలంటూ హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జక్కిడి అంజిరెడ్డి సోమవారం హౌస్‌‌మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ సోమవారం విచారించారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ కె.విజయ భాస్కర్‌‌రెడ్డి వాదిస్తూ..తన క్లయింట్ ది వ్యవసాయ భూమి అని, పాస్‌‌బుక్‌‌తో సహా అన్ని పత్రాలున్నాయన్నారు. 2012లో పంచాయతీ అనుమతులతో నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. ఇంటి నంబరు ఉందని, ఆస్తి పన్ను చెల్లిస్తున్నారని, భూవినియోగ మార్పిడి కూడా జరిగిందన్నారు. అయితే, బడంగ్‌‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మీర్‌‌పేటలోని పెద్దచెరువు (మీర్‌‌పేట తాలబ్‌‌) ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో నిర్మాణాలున్నాయంటూ హైడ్రా నోటీసులు జారీ చేసిందన్నారు. 

దీనిపై వినతి పత్రం సమర్పించడానికి కార్యాలయానికి వెళితే ఎవరూ అందుబాటులో లేరన్నారు. వాదనలను విన్న కోర్టు.. హైడ్రా నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఈ నెల 17వ తేదీ వరకు పిటిషనర్‌‌కు గడువు ఇవ్వాలని తెలిపింది.  ఏదైనా సమస్య ఉంటే 4 వారాల్లో పరిష్కరించి నిర్ణయం వెలువరించాక.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది.