- షూటింగ్‌లో అదరగొడుతున్న హైదరాబాదీ ధనుష్
- బధిరుల, సాధారణ టోర్నీల్లో పతకాల మోత.. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు
హైదరాబాద్, వెలుగు: అది 2019 ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్. ఆటలో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న హైదరాబాద్ కుర్రాడు మూడు గోల్డ్ మెడల్స్‌తో మెరిశాడు. రెండేండ్ల తర్వాత జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడి స్వర్ణం తెచ్చాడు. 2013లో సీనియర్ లెవెల్‌కు వచ్చి వరల్డ్ కప్‌లో బరిలోకి దిగాడు. అక్కడా అతని గురి తప్పలేదు. మరో గోల్డ్, సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. ఓ సాధారణ షూటర్ కెరీర్‌లోనే ఇవి గొప్ప ఘనతలు. అలాంటిది ఓ బధిర క్రీడాకారుడు మామూలు షూటర్లతో పోటీ పడుతూ ఇన్ని పతకాలు నెగ్గాడంటే నమ్మడం కష్టమే. పుట్టుకతోనే చెవులు వినబడకున్నా.. సరిగ్గా మాట్లాడలేకపోతున్నా ఆటలో అద్భుతాలు చేస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన యంగ్ షూటర్ ధనుశ్ శ్రీకాంత్. ఓవైపు నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో సాధారణ షూటర్లతో పోటీకి సై అంటూనే.. బధిరుల క్రీడల్లోనూ అదరగొడుతున్నాడు. రెండేండ్ల కిందట డెఫ్‌లింపిక్స్‌లో రెండు బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన ధనుష్ తాజాగా వరల్డ్ డెఫ్ చాంపియన్‌షిప్‌లోనూ రెండు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తూ డబుల్ గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటాడు. వైకల్యాన్ని అధిగమించి.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ధనుష్ 2028 ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
గురి పెడితే పతకమే
ధనుష్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇప్పటిదాకా 11 పతకాలు నెగ్గాడు. అందులో పది స్వర్ణాలే ఉన్నాయంటే అతని టాలెంట్ ఏంటో చెప్పొచ్చు. హైదరాబాద్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ధనుష్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. తల్లిదండ్రులు ఆశ, శ్రీకాంత్ రఘునాథన్ కూడా అతడిని సాధారణ పిల్లాడిగానే చూశారు. తనకు నచ్చిన ఆటలను ఆడించారు. రెగ్యులర్ స్కూల్లోనే చదివించారు. తొలుత తైక్వాండోను ఇష్టపడ్డ ధనుష్ అందులో డాన్1, 2 బెల్ట్‌లు కూడా సాధించాడు. ఓ రోజు తమ ఇంటికి దగ్గర్లోని గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీకి వెళ్లడం ధనుష్ జీవితాన్ని మార్చింది. అప్పటికే బొమ్మ తుపాకీలతో ఆడుకునే శ్రీకాంత్.. అక్కడి రైఫిల్స్‌పై మనసు పారేసుకున్నాడు. అలా 16 ఏండ్ల వయసులో తొలిసారి రైఫిల్ పట్టుకున్నాడు. ధనుష్ టాలెంట్‌ను గుర్తించిన గగన్ నారంగ్ అతనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. దాంతో మూడేండ్లలోనే ఆ కుర్రాడు ఆటలో రాటు దేలాడు. 2019లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సాధారణ షూటర్లతో పోటీ పడ్డ ధనుష్..10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో గోల్డ్ మెడల్ నెగ్గాడు. ఈ ఘనత సాధించిన తొలి బధిర క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. అక్కడి నుంచి తను వెనుదిరిగి చూసింది లేదు. నేషనల్ ఈవెంట్లలో ఇప్పటిదాకా నాలుగు గోల్డ్ సహా ఎనిమిది మెడల్స్ సాధించాడు.
అదే జోరును ఇంటర్నేషనల్ లెవెల్లోనూ చూపెడుతున్నాడు. ధనుష్‌కు రెగ్యులర్ ఈవెంట్లలోనే పోటీపడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ గగన్ నారంగ్ సూచనతో 2022 డెఫ్‌లింపిక్స్‌లో బరిలోకి దిగాడు. డెఫ్‌లింపిక్స్ షూటింగ్‌లో అప్పటిదాకా ఇండియాకు గోల్డ్ మెడల్ లేకపోవడమే అందుకు కారణం. గగన్ నమ్మకాన్ని వమ్ముచేయని ధనుష్ 10 మీ. రైఫిల్‌లో వరల్డ్ రికార్డు స్కోరుతో గోల్డ్ నెగ్గడంతో పాటు మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ మరో బంగారు పతకం నెగ్గాడు. తాజాగా వరల్డ్ డెఫ్ చాంపియన్‌షిప్స్‌లో 10 మీ. రైఫిల్ ఇండివిడ్యువల్, మిక్స్‌డ్ ఈవెంట్లలో రెండు వరల్డ్ రికార్డులతో బంగారు పతకాలు తెచ్చాడు. ప్రస్తుతం ధనుష్ 2028 ఒలింపిక్స్‌పై ఫోకస్ పెట్టాడు. ఇందుకోసం రెగ్యులర్ టోర్నీల్లో ఆడుతూ 2028 గేమ్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే డెఫ్‌లింపిక్స్‌లోనూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటానని చెబుతున్నాడు.
ప్రభుత్వ సాయం కావాలి
ధనుష్‌ను మేం ఏనాడూ ప్రత్యేకంగా చూడలేదు. తన ఇష్టాన్ని కాదనలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆటలో కొనసాగిస్తున్నాం. ధనుష్ ఇంటర్నేషనల్ లెవెల్లో నిలకడగా పతకాలు తెస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. గత ప్రభుత్వంలో అధికారులు, మంత్రుల చుట్టూ తిరిగినా అభినందనలు తప్పితే ఆర్థిక సాయం చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా మా అబ్బాయి ప్రతిభను గుర్తించి సాయం చేస్తే తను మరిన్ని పతకాలు తెస్తాడు.
- ధనుష్ తల్లి ఆశ