
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2020లో దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. అప్పటి మంత్రి కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్‌ను ఎలాంటి అనుమతుల్లేకుండా డ్రోన్‌తో చిత్రీకరించారంటూ అప్పటి ఎంపీగా ఉన్న రేవంత్‌పై కానిస్టేబుల్ జి.వెంకటేశ్ ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో రేవంత్ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ఫిర్యాదుదారు వెంకటేశ్‌ను కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అలాగే, తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలంటూ రేవంత్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణను వాయిదా వేసింది.