భుజంగరావు బెయిలు పిటిషన్‌‌పై విచారణ నేటికి వాయిదా

భుజంగరావు బెయిలు పిటిషన్‌‌పై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్‌‌.భుజంగరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌‌పై గురువారం వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్‌‌ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌‌ను అక్రమంగా కేసులో ఇరికించారన్నారు. కేవలం నేరాంగీకార వాంగ్మూలం ద్వారా అరెస్ట్‌‌ చేయడం కరెక్ట్​ కాదన్నారు. సరైన కారణాలు వెల్లడించకుండా అరెస్ట్‌‌ చేశారని, అందువల్ల రిమాండ్‌‌కు ఆదేశించడం చెల్లదని, రిమాండ్‌‌ చట్టవిరుద్ధమన్నారు. 

అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిలు పొంది చికిత్స చేయించుకున్నారని, ట్రీట్‌మెంట్ ఇంకా కొనసాగించాల్సి ఉన్నందున బెయిలివ్వాలని కోరారు. పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్‌‌ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. ఎస్‌‌ఐబీలోని వారికి సెక్యూరిటీకి సంబంధించిన అంశాలతో సంబంధం లేకపోయినా ఆ పేరుతో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు పాల్పడ్డారన్నారు. పిటిషనర్‌‌కు రిమాండ్‌‌ విధించడం చట్టవిరుద్ధమన్నారు. 

అన్ని అంశాలను పరిశీలించాకే కింది కోర్టు రిమాండ్‌‌ విధిస్తుందని, దీనిపై అభ్యంతరాలుంటే అప్పుడే కోర్టును ఆశ్రయించాల్సి ఉందన్నారు. 9 నెలల తర్వాత రిమాండ్‌‌ చట్టవిరుద్ధమనడం కరెక్ట్ ​కాదన్నారు. రెండో నిందితుడైన ప్రణీత్‌‌రావు వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌‌ను అరెస్ట్‌‌ చేశామని చెప్పారు. అభియోగ పత్రం దాఖలు చేశాక 26 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించామని, ఈ దశలో బెయిలివ్వడం సరికాదన్నారు.