
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుందని బెంచ్ పేర్కొంది.
సీజేఐతోకూడిన ప్యానెల్ ద్వారా సీఈసీ, ఈసీ ఎంపిక జరగాలని 2023లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్ర సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఎన్జీవో తరఫున హాజరైన ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. ఈ విషయం ఐటమ్ నంబర్ 41 కింద ఫిబ్రవరి 19 న లిస్ట్ చేశారని, అయితే.. ఇప్పటికే కేంద్ర సర్కారు ధర్మాసనం తీర్పును పక్కనపెట్టి సీఈసీ, ఈసీని నియమించిందని, ఈ అంశంపై తక్షణ విచారణ అవసరమని అన్నారు.
కాగా, కొన్ని అత్యవసర కేసుల తర్వాత ఈ అంశంపై కచ్చితంగా విచారణ చేపడుతామని ప్రశాంత్ భూషణ్తోపాటు మిగతా పక్షాలకు బెంచ్ హామీ ఇచ్చింది.