కవిత బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై విచారణ జూలై 22కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై విచారణను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్​షీట్​ను పరిగణనలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చే పిటిషన్‌‌‌‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ చార్జ్​షీట్‌‌‌‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫు అడ్వకేట్ వాదనలు వినిపించారు. 

డీఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌‌‌‌లో ఉన్న తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన కోర్టును కోరారు. అయితే, చార్జ్ షీట్‌‌‌‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు లాయర్ పేర్కొన్నారు. చార్జ్ షీట్‌‌‌‌ పూర్తిగా లేదని తాము వాదించడం లేదని, తప్పుగా ఉందని మాత్రమే చెబుతున్నట్టు నితీశ్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. తాము సరైన పద్ధతిలోనే చార్జ్ షీట్‌‌‌‌ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది. విచారణను ఈ నెల 22కు వాయిదా పడింది.