హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ అడ్మిషన్‌లలో స్థానికత వివాదానికి సంబంధించిన పిటిషన్‌లపై విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. పీజీ మెడికల్ అడ్మిషన్‌ల నిబంధనలకు సవరణ తీసుకువస్తూ జారీ చేసిన జీవో 148 సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ జీవో ప్రకారం తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారిని మాత్రమే స్థానికులుగా పరిగణిస్తారన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌లపై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.