![రఘురామరాజు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా](https://static.v6velugu.com/uploads/2025/02/hearing-on-raghurama-rajus-quash-petition-postponed_Y0mSwKU4Gz.jpg)
న్యూఢిల్లీ, వెలుగు: కానిస్టేబుల్ పై దాడి కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు నివాసం వద్ద డ్యూటీలో ఉన్న తనపై రఘురామ కృష్ణరాజుతో పాటు మరో నలుగురు దాడి చేశారని ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ బాషా ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుమారుడిపై దాఖలైన కేసును క్వాష్ చేయాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం విచారణ జరిగింది. ఫరూక్ బాషా తరఫున వకాలత్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని బెంచ్ ను ఆయన తరపు అడ్వొకేట్ అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. వకాలత్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇచ్చింది.